ఇజ్రాయేల్ దాడిలో హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లెబనాన్ రాజధాని బీరుట్‌పై మంగళవారం ఇజ్రాయేల్ జరిపిన వైమానిక దాడుల్లో హెజ్బొల్లా కమాండర్ ఇబ్రహీం క్వబైసీ హతమయ్యాడు. ఈ దాడిలో అతడితో పాటుగా మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్ రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇబ్రహీం క్వబైసీ.. హెజ్బొల్లా క్షిపణి వ్యవస్థకు చీఫ్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. గతవారం రోజుల నుంచి లెబనాన్‌లో చోటుచేసుకున్న పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల ఘటనలు, అనంతరం హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయేల్ దాడులతో పశ్చిమాసియా రక్తసిక్తమవుతోంది.
నాలుగు రోజుల నుంచి దాడులను ఉద్ధృతం చేసిన ఇజ్రాయేల్.. రాకెట్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. మంగళవారం జరిగిన దాడిలో 500 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. మరో 1,600 మంది గాయపడ్డారు. అయితే, కేవలం క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేసినట్లు ఇజ్రాయేల్ రక్షణశాఖ వెల్లడించింది. తమ ప్రజలకు ముప్పు తొలగిపోయే వరకూ దాడులు కొనసాగుతాయని ఆ దేశ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. అంతేకాదు, హెజ్బొల్లా ఉగ్రవాదుల కోసం మానవ కవచాలుగా మారి.. జీవితాలను కోల్పోవద్దని ఆయన హెచ్చరించారు. హెజ్బొల్లా ఆయుధాలను దాచిపెట్టిన నివాసాల నుంచి దూరంగా వెళ్లాలని సూచించారు.
కాగా, హెజ్బొల్లాకు కంచుకోట అయిన దహియే సుబుర్బ్‌పై ఇజ్రాయేల్ మంగళవారం దాడులు చేసింది. హెజ్బొల్లా నిర్వహించే క్షిపణి దాడులకు దహియే సుబుర్స్ ప్రధాన కేంద్రం ఈ ప్రాంతానికి క్షిపణుల ఫ్యాక్టరీగా గుర్తింపు ఉంది. ‘‘హెజ్బొల్లాను అంతం చేసే వరకు మా దాడులు ఆగవు.. వారిని ఊపిరి తీసుకోకుండా చేస్తాం. రాబోయే రోజుల్లో అన్ని వైపుల నుంచి దాడులను మరింత ఉద్ధృతం చేస్తాం’’ అని ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ ( ఐడీఎఫ్) ఉద్ఘాటించింది. ఆయుధాలు నిల్వ చేసిన నివాసాలు, ఇతర ప్రదేశాలను తక్షణమే వీడాలని స్థానికులకు సూచించాయి. మరోవైపు, ఇజ్రాయేల్ దాడులకు ప్రతీకారంగా ఆ దేశ ఉత్తర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని హెజ్బొల్లా దాదాపు 150 రాకెట్లు, క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడింది.