ప్రపంచంలోనే అతిపెద్దదైన చైనా నిర్మించిన త్రీ గోర్జెస్ డ్యామ్‌తో భూమికి ముప్పు ఏర్పడనుందా?.. ఈ డ్యామ్ కారణంగా భూగమనంలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయా?.. అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ డ్యామ్ కారణంగా ఎప్పటికైనా భూగ్రహానికి ముప్పేనని బ్రిటన్ సైంటిస్టులు హెచ్చరికలు చేస్తున్నారు. హుబే ప్రావిన్సుల్లోని యాంగ్జీ నదిపై సుమారు 2.33 కి.మీ పొడవు, 181 మీటర్ల ఎత్తులో త్రీగోర్జెస్ డ్యామ్‌ను చైనా నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ డ్యామ్ అంతరిక్షం నుంచి సాధారణ కంటికి కనిపించే కట్టడాల్లో ఒకటి.
ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 1994లో ప్రారంభించిన చైనా 2006 నాటికి పూర్తిచేసింది. డ్యామ్ కోసం 114 పట్టణాలు, 1,680 గ్రామాలను చైనా ప్రభుత్వం ఖాళీ చేయించింది. ఫలితంగా 14 లక్షల మందికి పునరావసం కల్పించింది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత యాంగ్జి నదిలో పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉన్న కారణంగా భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకెన్లు తగ్గిపోయిందని అప్పట్లోనే శాస్త్రవేత్తలు లెక్కలు కట్టారు. అంతేకాకుండా సూర్యుడి నుంచి భూమి దూరం 2 సెంటీమీటర్ల మేర దూరం జరిగిందని వెల్లడించారు. దీని ప్రభావం రానురానూ ఇంకా పెరుగుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూమిపై భారీ మొత్తంలో ఏమైనా మార్పులు జరిగినప్పుడు దాని ప్రభావం భూ గమనంపై పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తోంది. 2004లో హిందూ మహా సముద్రంలో భూకంపం సంభవించి సునామీ వచ్చినప్పుడు భూ గమనంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. దాని ప్రభావంతో రోజు నిడివి సుమారు 2.68 మైక్రో సెకెన్లు తగ్గిపోయింది. ప్రస్తుతం త్రీ గోర్జెస్ డ్యామ్ వల్ల కూడా ఇదే ప్రమాదం సంభవిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
త్రీ గోర్జెస్ డ్యామ్‌కు మూడు నదుల నుంచి నీరు వచ్చి చేరుతుంది. సుమారు 10 ట్రిలియన్ గ్యాలన్ల నీటిని ఇది నిల్వ చేస్తుంది. అంతభారీ మొత్తంలో నీరు ఒకే చోట చేరడం భూమిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ డ్యామ్ ద్వారా 22,500 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.. అంటే ప్రపంచంలోనే అతిపెద్దవైన మూడు అణు విద్యుత్తు కేంద్రాల ఉత్పత్తికి దాదాపు ఇది సమానం. ఈ డ్యామ్ నీటి నిల్వ కారణంగా భూమి అడుగున ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. యాంగ్జీ నదికి వరదలు వచ్చిన ప్రతిసారీ లక్షల మంది నిరాశ్రయులుగా మారుతున్నారు. వరద తీవ్రత పెరిగి ఈ డ్యామ్‌కు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ నష్టం ఊహకు కూడా అందదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.