ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విటర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వారిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుండటంతో మస్క్, మెలోనీ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు బయటికి వచ్చాయి. ఇక ఇదే సమయంలో తాజాగా జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఎలాన్ మస్క్.. జార్జియా మెలోనీపై ప్రశంసల వర్షం కురిపించడంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారనే వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. దీంతో వీరిద్దరి మధ్య డేటింగ్ వార్తలపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ.. అడిగిన ఓ ప్రశ్నకు ఎలాన్ మస్క్ సమాధానం ఇచ్చారు.
53 ఏళ్ల ఎలాన్ మస్క్, 47 ఏళ్ల జార్జియా మెలోనీ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ.. వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారా అంటూ ట్విటర్‌లో ప్రశ్నించింది. ఈ పోస్ట్‌కు సమాధానం ఇచ్చిన ఎలాన్ మస్క్.. తాము ఇద్దరం డేటింగ్ చేయడం లేదని ఒక క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొనగా.. ఎలాన్ మస్క్, జార్జియా మెలోనీ కలిసి ఉన్న ఒక ఫోటో బయటికి వచ్చింది. దీంతో వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు బయటికి వచ్చాయి.
ఇక తాజాగా మంగళవారం న్యూయార్క్‌లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన ఎలాన్ మస్క్.. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని నిజాయతీపరురాలు అని ప్రశంసలు కురిపించారు. మరోవైపు.. జార్జియా మెలోనికి అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డును అందజేస్తూ.. ఎలాన్ మస్క్ మరిన్ని పొగడ్తలు బయటపెట్టారు. జార్జియా మెలోని బయట కన్నా ఆమె మనసు మరింత అందమైంది అని ప్రశంసించారు. నేను అభిమానించే వ్యక్తి జార్జియా మోలోని అని.. ఆమె ఇటలీ ప్రధానమంత్రిగా అద్భుతంగా పనిచేస్తున్నారంటూ కొనియాడారు.
వీరిద్దరి ఫోటో వైరల్ అవుతున్న వేళ.. ఈ కార్యక్రమంలో జార్జియా మెలోనీపై ఎలాన్ మస్స్ పొగడ్తలు కురిపించడంతో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అట్లాంటిక్ కౌన్సిల్ ప్రకారం జార్జియా మెలోని.. యూరోపియన్ యూనియన్‌కు బలమైన మద్దతు ఇవ్వడంతో పాటు ఇటలీకి మొదటి మహిళా ప్రధాని అయినందుకు ఆమెను ఈ గ్లోబల్ సిటిజన్ అవార్డు దక్కింది.