ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ కు గురైన టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియాతో 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్-ట్రోఫీ సిరీస్ కోసం సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగే ఈ సిరీస్ లో తొలి టెస్టు పెర్త్ వేదికగా ఈ నెల 22న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో టీమిండియాకు మొదటి రెండు మ్యాచ్ లు అత్యంత కీలకమని అభిప్రాయపడ్డాడు. ఇటీవల, ఏం జరుగుతోందో తెలిసే లోపే న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమిపాలైందని అన్నాడు. కివీస్ తో టెస్టు సిరీస్ లో ఏమరుపాటుగా వ్యవహరించిన టీమిండియా అందుకు మూల్యం చెల్లించిందని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. అంతమాత్రాన టీమిండియాను తక్కువ చేసి చూడలేమని, ఈ జట్టును చూసి గర్విస్తున్నానని తెలిపాడు.ఓ సిరీస్ లో ఎదురైన ఓటమి నుంచి పుంజుకోవాలంటే మరో సిరీస్ లో శుభారంభం చేయడమే మార్గమని అభిప్రాయపడ్డాడు. అందుకే, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టులు టీమిండియా కోణంలోంచి చూస్తే ఎంతో ముఖ్యమని అన్నాడు.