చాంపియన్స్ ట్రోఫీ-2025 పాకిస్థాన్ లోనే జరిగేట్టయితే, టోర్నీలో తాము పాల్గొనబోమని బీసీసీఐ తెగేసి చెప్పిన విషయం తెలిసిందే. అయితే, బీసీసీఐ నిర్ణయంపై ఐసీసీ స్పందన కోసం తాము ఇప్పటికీ ఎదురుచూస్తున్నామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహిసిన్ నక్వీ వెల్లఇంచారు. బీసీసీఐ నిర్ణయంపై ఏం తేల్చారో వివరాలు తెలపాలని కోరుతూ పీసీబీ... ఐసీసీకి లేఖ రాసింది. అంతేకాదు, టోర్నీలో పాల్గొనకపోవడంపై లిఖితపూర్వకంగా తెలియజేయాలని బీసీసీఐని కోరింది. ఈ నేపథ్యంలో, పీసీబీ చైర్మన్ నక్వీ స్పందించారు. చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ నిర్వహణపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో, టోర్నీ జరిగి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. "మాకున్న సందేహాలను నివృత్తి చేయాలని ఐసీసీకి లేఖ రాశాం. ఐసీసీ స్పందన కోసం ఎదురుచూస్తున్నాం. రాజకీయాలకు, క్రీడలకు ముడిపెట్టకూడదన్నది నా ఉద్దేశం. ఆ రెండు వేర్వేరు అంశాలను ఏ దేశం కూడా కలిపే ప్రయత్నం చేయకూడదు. చాంపియన్స్ ట్రోఫీ సజావుగానే జరుగుతుందని ఇప్పటికీ నాకు నమ్మకం ఉంది" అని మొహిసిన్ నక్వీ వివరించారు.