ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన 25 ఏళ్ల టీమిండియా క్రికెటర్ పృథ్వీషాపై ఢిల్లీ కేపిటల్స్ జట్టు సహ యజమాని పార్థ్ జిందాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడప్పుడు ఇలాంటి దెబ్బలు తగలాల్సిందేనని చెప్పుకొచ్చారు. 2018లో భారత జట్టుకు అండర్-19 ప్రపంచకప్ అందించిన షా టీమిండియాకు భవిష్యత్ ఆశాకిరణమయ్యాడు. అయితే, పృథ్వీషా ప్రతిభ ఆ తర్వాత క్రమంగా మసకబారింది. ఐపీఎల్ వేలంలో రూ. 75 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలో నిలిచిన పృథ్వీని తీసుకునేందుకు ఏ జట్టూ ముందుకు రాకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. 2018 నుంచి ఆరేళ్లపాటు ఢిల్లీ కేపిటల్స్‌కు ఆడిన షాను నిలకడ లేమి కారణంగా జట్టు వదిలించుకుంది. ఈ నేపథ్యంలో వేలానికి వెళ్లినా అతడికి నిరాశే ఎదురైంది. షా అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడంపై ఢిల్లీ కేపిట్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ తాజాగా మాట్లాడుతూ.. షా ప్రయాణంలో ఒడిదొడుకుల గురించి చాలా విషయాలు మాట్లాడారు. పృథ్వీ గొప్ప ఆటగాడని, అయితే తనను తాను తప్పుగా అర్థం చేసుకున్నాడని పేర్కొన్నారు. ఇలాంటి ఎదురుదెబ్బలు అప్పుడప్పుడు తగులుతూ ఉండాలని పేర్కొన్నారు. పతనం నుంచి అతడు బయట పడాలని ఆకాంక్షించారు.షా కెరియర్ మొదట్లో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా వంటి వారితో పోల్చి అతడి ఎదుగుదలకు ఆటంకం కలిగించే వాతావరణాన్ని సృష్టించారని జిందాల్ విమర్శించారు. ముంబై క్రికెట్లో ప్రతి ఒక్కరు అతడి గురించి మాట్లాడేవారని గుర్తు చేశారు. ముంబై ఒక సునీల్ గవాస్కర్, ఒక సచిన్ టెండూల్కర్‌ను ఇచ్చిందని, అలాగే పృథ్వీషా గురించి కూడా మాట్లాడుకున్నారని చెప్పారు. కాబట్టి అతడికి ఇలాంటి ఎదురుదెబ్బలు తగలాలని పార్థ్ జిందాల్ పేర్కొన్నారు.