భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి అయినప్పటికీ, భారత క్రికెట్ దశ దిశ అన్నీ తానై నడిపిస్తున్న జై షా... ఇప్పుడు ఐసీసీ పీఠాన్ని అధిష్ఠించారు. ఐసీసీ నూతన చైర్మన్ గా ఆయన ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. జై షా ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ప్రస్తుతం జై షా వయసు 35 ఏళ్లు కాగా... ఐసీసీ చైర్మన్ పదవిని చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా ఘనత అందుకున్నారు. అంతేకాదు, ఐసీసీ పీఠం ఎక్కిన ఐదో భారతీయుడు జై షా. ఇప్పటివరకు ఐసీసీలో భారత్ కు ప్రముఖ స్థానం దక్కుతూ వస్తోంది. గతంలో జగ్మోహన్ దాల్మియా (1997-2000), శరద్ పవార్ (2010-12) ఐసీసీ అధ్యక్షులుగా పనిచేయగా... ఎన్ శ్రీనివాసన్ (2014-15), శశాంక్ మనోహర్ (2015-2020) ఐసీసీ చైర్మన్లుగా వ్యవహరించారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడైన జై షా... 2009లో క్రికెట్ పాలనా వ్యవహారాల్లో తన ప్రస్థానం ప్రారంభించారు. గుజరాత్ క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన షా... అహ్మదాబాద్ లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను నిర్మించడంలో కీలకపాత్ర పోషించారు. 2019లో బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగానూ, ఐసీసీ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీ చైర్మన్ గానూ వ్యవహరించారు. కాగా, 2020 నవంబరు నుంచి ఐసీసీ చైర్మన్ గా గ్రెగ్ బార్ క్లే వ్యవహరించారు. ఇప్పుడు బార్ క్లే స్థానంలో జై షా ఐసీసీ పగ్గాలు అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యున్నత పదవిని చేపట్టడం గౌరవంగా భావిస్తున్నానని జై షా తెలిపారు. తనకు మద్దతిచ్చిన ఐసీసీ బోర్డు డైరెక్టర్లకు, సభ్య దేశాల క్రికెట్ బోర్డులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.