ఆస్ట్రేలియా ప్రైమ్‌మినిస్టర్ 11తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ముఖ్యంగా ఆడిలైడ్ వేదికగా జరిగే రెండో టెస్టుకు ముందు భారత జట్టుకు మంచి ప్రాక్టీస్ లభించింది. వాస్తవానికి ఈ మ్యాచ్ శని, ఆదివారాల్లో జరగాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా తొలి రోజు ఆట సాధ్యం కాలేదు. దీంతో ఆదివారమే 50 ఓర్ల చొప్పున మ్యాచ్ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. రెండో టెస్టుకు ముందు పింక్‌బాల్‌తో ప్రాక్టీస్ చేయడమే లక్ష్యంగా భారత్ ఈ మ్యాచ్‌లో ఆడింది.
అయితే ఈ మ్యాచ్‌ను పింక్‌బాల్‌తో 50 ఓవర్ల చొప్పున నిర్వహించాలని భావించినా.. వర్షం కారణంగా 46 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్ 43.2 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ సామ్ కాన్స్‌టస్ (107) సెంచరీ కొట్టాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. ఆకాశ్ దీప్ 2, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేయలేదు. అనంతరం భారత జట్టు 42.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ఇది ప్రాక్టీస్ మ్యాచే కాబట్టి.. మ్యాచ్‌లో గెలిచినా.. 46 ఓవర్ల పాటు భారత జట్టు బ్యాటింగ్ చేసింది. చివరకు 257/5 స్కోరు నమోదు చేసింది.
పెర్త్ టెస్టులో ఓపెనర్లుగా బరిలోకి దిగిన జైశ్వాల్, రాహుల్‌లే ఈ మ్యాచ్‌లోనూ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. యశస్వి జైశ్వాల్ 59 బంతుల్లో 45 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ 44 బంతుల్లో 27 రన్స్ చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. ఇతర బ్యాటర్లకు అవకాశం ఇచ్చాడు. బొటనవేలు గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకున్నాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 62 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి రిటైర్ట్ హర్ట్ అయ్యాడు. నితీశ్ రెడ్డి (42), వాషింగ్టన్ సుందర్ (42*), రవీంద్ర జడేజా (27)లు కూడా రాణించారు.
అయితే అందుబాటులో లేక తొలి టెస్టులో ఆడలేకపోయిన రోహిత్ శర్మ మాత్రం ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 3 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్‌లు బ్యాటింగ్‌కు దిగలేదు. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈనెల 6 నుంచి రెండో టెస్టు ఆడిలైడ్ వేదికగా జరగనుంది. ఇది డే/నైట్ టెస్టు కావడం గమనార్హం.