టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, అతడి సతీమణి రితికా సజ్డేలు ఇటీవల రెండోసారి తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. అందుకోసమే రోహిత్ శర్మ.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలిటెస్టుకు దూరమయ్యాడు. అయితే రోహిత్ శర్మకు కొడుకు పుట్టాడని అంతా చెబుతున్నా.. వీరిద్దరు మాత్రం పేరు వెల్లడించలేదు. ఎట్టకేలకు రోహిత సతీమణి రితికా సజ్డే.. ఫ్యాన్స్‌కు తమ ముద్దుల కుమారుడి పేరును వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రితికా తమ కుమారుడి పేరును ప్రకటించారు.
డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే స్టైల్‌లో తమ కుమారుడి పేరును రితికీ రివీల్ చేశారు. 4 క్రిస్మస్ బొమ్మలపై తమ కుటుంబంలోని నలుగురి పేర్లను రాసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. దీంతో రోహిత్- రితికాల కుమారుడి పేరు ‘అహాన్’ అని వెల్లడైంది. రితికా పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. రితికా- రోహిత్ శర్మ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2015 డిసెంబర్ 13న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందే రోహిత్ జంటకు రెండో సంతానంగా మగ బిడ్డ పుట్టాడు. అయితే పెళ్లైనా మూడేళ్లకు అంటే 2018 డిసెంబరు 30న వీరి జీవితంలోకి తొలి సంతానంగా అమ్మాయి జన్మించగా.. ఆమె పేరును సమైరా అని పెట్టారు. అయితే.. ఇప్పుడు జన్మించిన కుమారునికి అహన్ అని పేరు పెట్టారు. అయితే.. తన కుమారుడి పేరును రితికా సజ్డే రివీల్ చేయటంతో.. సోషల్ మీడియాలో రోహిత్ శర్మ ఫ్యాన్స్‌తో పాటు, ఇండియన్ క్రికెట్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ రోహిత్ శర్మ వచ్చేశాడంటూ నెట్టింట జోరుగా పోస్టులు పెడుతున్నారు.
మరికొందరేమో ఓ అడుగు ముందుకేసి.. భవిష్యత్‌లో విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా కుమారులు భారత క్రికెట్ జట్టు తరఫున ఆడతారని జోస్యం చెబుతున్నారు. అకాయ్ కోహ్లీ, అంగడ్ బుమ్రా, అహాన్ శర్మ, ఆగస్త్య పాండ్యాలు భారత క్రికెట్‌ను ఏలుతారంటూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు.