ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని ఎట్టిపరిస్థితుల్లో పాకిస్థాన్‌లోనే నిర్వహిస్తామని.. హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోమని ఇన్నాళ్లు మొండిపట్టు పట్టిన పీసీబీ.. ఎట్టకేలకు దిగొచ్చింది. ఐసీసీ సహా అందులోని సభ్యదేశాలు హైబ్రిడ్ మోడల్‌కు ఓకే చెప్పడంతో ఇక చేసేదేం లేక తటస్థ వేదికల్లో టోర్నీ నిర్వహించేందుకు అంగీకరించింది. పాకిస్థాన్‌లో పర్యటించేందుకు భారత క్రికెట్ జట్టు అంగీకరించకపోవడంతో ఐసీసీ ఇచ్చిన ఆఫర్‌కు తప్పని పరిస్థితుల్లో ఒప్పుకుంది. అయితే ఇందులోనూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ మెలిక పెట్టింది. భారత జట్టు తమ దేశంలో పర్యటించనప్పుడు.. ఆ దేశంలో కూడా తాము పర్యటించబోమని స్పష్టం చేసింది.
"ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వేదిక గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలని అనుకోవడం లేదు. దాంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది. పాక్‌కు వచ్చే విషయంలో భారత్.. తన విధానాన్ని ఐసీసీకి చెప్పింది. మేం కూడా అదే మా విధానమేంటో చెప్తాం. ఏం చేసినా.. ఇద్దరికీ లబ్ది జరగాలి. అంతిమంగా క్రికెట్ గెలవాలి. అందరికీ తగిన గౌరవం దక్కాలి. మేం క్రికెట్ కోసం ఏం చేసేందుకైనా సిద్ధమే. ఇదే సమయంలో పాకిస్థాన్ గౌరవం కూడా మాకు ముఖ్యమే. ఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా.. ఇరు జట్లపై ఒకే విధంగా ఉండాలి. భారత్ మా దేశంలో ఆడేందుకు రాకపోతే.. మేం కూడా అక్కడకు వెళ్లం" అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నఖ్వీ తెలిపారు.
అయితే పాకిస్థాన్ పెట్టిన కండీషన్‌పై ఐసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే భారత్ వేదికగా 2026లో టీ20 ప్రపంచకప్, 2029లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2031లో వన్డే ప్రపంచకప్ జరగనున్నాయి. వీటిల్లో పాల్గొనేందుకు తాము భారత గడ్డపై అడుగుపెట్టబోమని.. తమ జట్టు ఆడే మ్యాచ్‌లు తటస్థ వేదికల్లో నిర్వహించాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది.
ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి నెలల్లో పాక్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. అయితే భారత్ ఆడే మ్యాచ్‌లు యూఏఈ వేదికగా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ భారత్ ఫైనల్ చేరితే.. ఆ మ్యాచ్ కూడా పాక్ వెలుపలే జరగాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నిటీపై క్లారిటీ వచ్చాకే.. టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసే అవకాశం ఉంది.