యూఏఈ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్-2024 టోర్నీలో యువ భారత్ అదరగొట్టింది. బుధవారం యూఏఈని చిత్తు చేసిన భారత్.. టోర్నీలో వరుసగా రెండో విజయం సాధించి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 13 ఏళ్ల సెన్షేషన్ వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీతో అదరగొట్టడంతో భారత్ 10 వికెట్ల తేడాతో యూఏఈని ఓడించింది. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచుల్లో ఆశించిన మేర రాణించలేకపోయిన సూర్యవంశీ.. మూడో మ్యాచ్‌లో మాత్రం బ్యాట్ ఝుళిపించాడు. ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు తనను రూ.1.1 కోట్లు పెట్టి ఎందుకు తీసుకుందో తన బ్యాట్‌తోనే చెప్పేశాడు.
షార్జాలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ కెప్టెన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత బౌలింగ్ చేయాల్సి వచ్చింది. అయితే, భారత బౌలర్ల ధాటికి యూఏఈ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 44 ఓవర్లలో 137 పరుగులకు ఆ జట్టు ఆలౌట్ అయింది. మిడిలార్డర్ బ్యాటర్ రయాన్ ఖాన్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో యుధాజిత్ గుహ మూడు వికెట్లు తీశాడు. చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ రెండు చొప్పున, కేపీ కార్తికేయ, ఆయుశ్ మాత్రే ఒక్కో వికెట్ పడగొట్టారు.
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు.. పసికూనపై చెలరేగిపోయారు. ముఖ్యంగా 13 ఏళ్ల సూర్యవంశీ పెను విధ్వంసం సృష్టించాడు. వన్డే మ్యాచ్‌లో టీ20 తరహాలో బ్యాటింగ్ చేశాడు. ఈ టోర్నీలో ఆడిన తొలి రెండు మ్యాచుల్లో వైభవ్ విఫలమయ్యాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 9 బంతుల్లో 1 పరుగు, జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 బంతుల్లో 23 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో మాత్రం సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు.
32 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కును అందుకున్న వైభవ్ సూర్యవంశీ.. చివరకు 46 బంతుల్లో 76 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 6 సిక్స్‌లు, 3 ఫోర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ ఆయుశ్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. 51 బంతుల్లో 67 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్ 16.1 ఓవర్లలోనే వికెట్లేమీ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో భారత్ టోర్నీలో సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టింది.
ప్రస్తుతం గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉంది. సెమీఫైనల్-2లో భారత్.. శ్రీలంకతో తలపడే అవకాశం ఉంది. భారత కాలమానం ప్రకారం, డిసెంబర్ 6న ఉదయం 10.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అటు పాకిస్థాన్ కూడా సెమీస్ చేరింది. భారత్ - పాక్‌లు ఫైనల్‌లో తలపడతాయానని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.