రోజురోజుకూ మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. కన్నవాళ్లతో పాటు కట్టుకున్న వాళ్లు, పుట్టిన బిడ్డలను సైతం తమకు నచ్చని పనులు చేస్తే పగ పెంచుకుని మరీ ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఓ దారుణం జరిగింది. మనసుకు నచ్చిన అమ్మాయిని మనువాడుతానంటే తల్లి అభ్యంతరం చెప్పిందని.. ఓ 22 ఏళ్ల యువకుడు కన్నతల్లినే కడతేర్చాడు. ఆపై ఓ పెద్ద డ్రామా కూడా చేసి కేసు నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ అతడి పాపం పండి, వెంటనే పోలీసులకు పట్టుబడ్డాడు.
ఢిల్లీకి చెందిన 45 ఏళ్ల సులోచనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు కపిల్‌కు 26 ఏళ్ల వయసు కాగా.. చిన్న కుమారుడు సావన్‌కు 22 ఏళ్లు. సులోచన భర్త 2019లోనే మృతి చెందగా.. అప్పటి నుంచి కొడుకులిద్దరినీ ఆమే చూసుకుంటోంది. ప్రస్తుతం కపిల్ అకౌంటెంట్‌గా పని చేస్తుండగా సావన్ ఓ సరుకు రవాణా వాహనాన్ని నడుపుతున్నాడు. వచ్చిన దాంతోనే తల్లితో కలిసి జీవిస్తున్నారు.
ఇటీవలే కపిల్‌కు పెళ్లి ఫిక్స్ అయింది. మరికొన్ని రోజుల్లో అతడి పెళ్లి ఉండగా.. చిన్న కొడుకు సావన్ తాను కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అప్పటికే తన మనసుకు ఓ అమ్మాయి నచ్చడంతో అదే విషయాన్ని తల్లికి చెప్పాడు. అయితే తల్లి సులోచన.. సావన్ పెళ్లికి అభ్యంతరం చెప్పింది. నువ్వు ఇప్పుడే పెళ్లి చేసుకుంటే కష్టం అవుతుందని, తనను కాదని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో వాటా ఇవ్వనని తెగేసి చెప్పింది. దీంతో సావన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కన్నతల్లిపైనే కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా సరే తల్లిని చంపి తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఓ ప్రణాళిక రచించాడు.
శుక్రవారం (డిసెంబర్ 6) సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తల్లిని కత్తితో నరికి చంపేశాడు. ఆపై ఆమె మెడలోని నగలతో పాటు చెవి కమ్మలు తదిరతర ఆభరణాలను తీసుకుని దాచేశాడు. ఆపై పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు డ్రామా క్రియేట్ చేశాడు. రాత్రి 8.30 గంటలకు తానే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి.. తాను ఇంటికొచ్చేసరికి తల్లి రక్తపుమడుగులో పడి ఉందని, ఎవరో దొంగలు తన తల్లిని చంపారని ఫిర్యాదు చేశాడు.
హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు పోలీసులు. సులోచన మృదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనం కోసం ఎవరో తన తల్లిని చంపి ఉంటారని పోలీసుల వద్ద సావన్ అనుమానం వ్యక్తం చేశాడు. కానీ, అతడు చెప్పే మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు జరిపారు. ఇంట్లో వాళ్లను, స్థానికులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో సావన్ పొంతనలేని సమాధానాలు చెప్పాడు.
పోలీసులకు అనుమానం వచ్చి సావన్ అదుపులోకి తీసుకొని, తమదైన స్టైల్లో విచారించారు. దీంతో భయపడిన సావన్ అసలు విషయం చెప్పాడు. తన పెళ్లికి అభ్యంతరం చెప్పిందని తానే తల్లిని చంపినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.