ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మాయిలకు అబ్బాయిలు ఇలా ఉంటేనే ఇష్టం.. వారు కోరుకునే లక్షణాలివే

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Dec 08, 2024, 09:12 PM

లవ్.. ప్రేమ.. కాదల్ భాష ఏదైనా ఇది జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఏదైనా బంధం స్ట్రాంగ్‌గా ఉండాలంటే ప్రేమ చాలా కీలకం. ప్రేమకు సంబంధించి ఇప్పటికే చాలా పుస్తకాలు, పాటలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చాయి. అవి సూపర్ హిట్ కూడా అయ్యాయి. మన గ్రంథాలు కూడా ప్రేమకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాయి. సంతోషకరమైన బంధానికి ప్రేమ చాలా అవసరం. ప్రేమను ఏ సమయంలో వ్యక్తపరచాలి.. మీ భాగస్వామిని ఎలా చూసుకోవాలన్నది తెలుసుకోవడం కూడా చాలా కీలకం.


ఎవరినైనా ప్రేమిస్తున్నప్పుడు వారి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇష్టపడతారు. వారి లోపాల్ని కూడా ఇష్టపడతారు. అయితే, రాను రాను భాగస్వామిలో లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే మనమందరం మనుషులం.. మనందరికీ కొన్ని లోపాలు ఉన్నాయి. ఇలాంటప్పుడు ప్రేమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి. మంచి భాగస్వామికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలతో ఎవరి ప్రేమనైనా పొందగలరు. గొప్ప భాగస్వామి అవ్వడానికి ఉండాల్సిన లక్షణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.


నిజాయితీ..


ఏ సంబంధానికైనా నిజాయితీ పునాది. నిజాయితీ అనేది భార్యాభర్తల లేదా ప్రేమికుల మధ్య బంధాన్ని బలపరచడమే కాకుండా పరస్పర విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. కొన్నిసార్లు నిజం చేదుగా అనిపించవచ్చు. కానీ ఈ నిజం దీర్ఘకాలంలో సంబంధాన్ని బలంగా మారుస్తుంది. చాలా మంది అమ్మాయిలు నిజాయితీగా, స్పష్టంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అబ్బాయిల వైపు ఆకర్షితులవుతారు. అందుకే నిజాయితీగా ఉండటం నేర్చుకోండి.


ప్రశంసించడం..


ప్రేమ ఎంత అందంగా ఉంటుందో అంతే సొగసైనది. మన ప్రవర్తన, వైఖరి మన మాటల కంటే బిగ్గరగా మాట్లాడతాయి. మీ భాగస్వామిని మెచ్చుకోవడం కూడా మంచి లక్షణం. అవమానాలు, బాధ కలిగించే మాటలు వారిని మానసికంగా వేధిస్తాయి. వీటిని వారు సులభంగా మరచిపోలేరు. కానీ, వారు చేసిన పనులకు మెచ్చుకుంటే వాటిని కూడా మర్చిపోరు. సరైన సమయానికి ప్రశంసలు దక్కితే మానసిక ఆరోగ్యానికి ఉపశమనం లభిస్తుంది. ఆ తర్వాత మిమ్మల్ని వారు చూసే తీరే మారిపోతుంది. ఒకరిపై ఒకరు శ్రద్ధ చూపుకుంటారు. ఏదైనా మంచి పని చేస్తే ప్రశంసించే అబ్బాయిలంటే అమ్మాయిలు ఇష్టపడతారు.


గౌరవం..


మంచి భాగస్వామికి ప్రేమ మాత్రమే ఉంటే సరిపోదు. భాగస్వామి పట్ల గౌరవం కూడా ఉండాలి. ప్రేమను అర్థం చేసుకోవడమే కాకుండా.. ఆలోచనలు, ఇష్టాలు, అయిష్టాలు, కలలను గౌరవించే భాగస్వామి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అమ్మాయిలకు తమ మాట వినడమే కాకుండా వారికి ప్రాముఖ్యతనిచ్చే అబ్బాయిలంటే ఇష్టం. కెరీర్‌లో ముందుకు సాగడానికి హెల్ప్ చేసే భాగస్వామి ఉండాలని కోరుకుంటారు. అంతేకాకుండా తమ పట్ల గౌరవం చూపించే అబ్బాయిలంటే అమ్మాయిలకు అమితమైన ప్రేమ.


పరిపక్వత..


ప్రపంచంలోని ఏ వ్యక్తి కూడా మిస్టర్ పర్ఫెక్ట్ కాలేడు.అమ్మాయిలు సాధారణంగా తమను అర్థం చేసుకునే లేదా అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అబ్బాయిలను ఇష్టపడతారు. ఎప్పుడూ పిల్లల్లాగే ప్రవర్తించే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడరు. ఓపెన్ మైండెడ్‌గా ఉండే అబ్బాయిలంటే అమ్మాయిలకు ఇష్టం. ఇలాంటి వారితోనే జీవితం ముందుకు సాగాలని కోరుకుంటారు. మనసులో ఒకటి పెట్టుకుని.. బయటకు ఇంకొకటి చేసే అబ్బాయిల్ని దూరంగా పెడతారు.


ప్రేమ..


నిజమైన ప్రేమ బహుమతులు, ఆస్తులు, అంతస్తుల నుంచి రాదు. హృదయం నుంచి వస్తుంది. మనం ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తున్నప్పుడు.. ఖరీదైన బహుమతులు, డబ్బు అవసరం లేదు. నిజమైన ప్రేమకి ఇవ్వన్నీ అవసరం లేదంటారు మానసిక నిపుణులు. మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించే భాగస్వామి కోసం వెతుకుతాం. తమ కోసం సమయం, శ్రద్ధ చూపించే అబ్బాయిలంటే అమ్మాయిలకి ఇష్టం. ఇంకేదో ఆశించే అబ్బాయిల్ని కచ్చితంగా అబ్బాయిలు దూరం పెడతారు. సోమరితనం, మాట ఇచ్చిన తర్వాత వెనక్కు తగ్గడం మీ ప్రియమైన వారిని ఎంత మాత్రం సంతోషపెట్టవు. వాళ్ల జీవితంలో ఎంత వరకు సపోర్ట్ చేస్తారు..? వారి బాధలకు మీరు ఎలా సానుభూతి చూపుతారు? ఇది మీ ప్రేమ యొక్క స్థాయిని పెంచుతుంది.


గమనిక..ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల మనసత్త్వాలు బట్టి ఫలితాలు మారుతుంటాయి. మీ మధ్య గొడవలు మొదలైతే మీరు సరైన నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com