టీమిండియా టీనేజ్ సెన్సేషన్ 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వయసుపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జునైద్ ఖాన్ అనుమానాలు వ్యక్తం చేశాడు. 13 ఏళ్ల కుర్రాడు భారీ సిక్సర్లు ఎలా కొడతాడని ప్రశ్నించాడు. ఇటీవల జరిగిన అండర్ 19 ఆసియాకప్ 2024లో వైభవ్ సూర్యవంశీ సిక్స్ హిట్టింగ్ సామర్థ్యం చూసి అవాక్కైన జునైద్ ఖాన్.. అతడు కొట్టిన సిక్స్ వీడియోను షేర్ చేశాడు. అతడికి 13 ఏళ్లంటే నమ్మశక్యంగా లేదని అభిప్రాయపడ్డాడు. వైభవ్ సూర్యవంశీ కొట్టిన ఓ భారీ సిక్స్‌ను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన జునైద్ ఖాన్.. "నిజంగా ఓ 13 ఏళ్ల కుర్రాడు ఇలాంటి భారీ సిక్స్ కొట్టగలడా?" అని క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో వైభవ్ సూర్యవంశీ వయసుపై మరోసారి చర్చ ప్రారంభమైంది.
అయితే కొందరు మాత్రం.. 13 ఏళ్లయితే ఏంటి.. 15 ఏళ్లు అయితే ఏంటీ ? అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మీ బౌలర్లు అండర్-19 క్రికెట్‌లోనే 150కేఎంపీహెచ్ వేగంతో బంతులేస్తే మాత్రం అద్భుతం.. సూర్యవంశీ వయసు మాత్రం అబద్దమా అని పేర్కొంటున్నారు. కాగా తన కుమారుడి వయసుపై వస్తున్న ఆరోపణలై సూర్యవంశీ తండ్రి సంజీవ్ ఇదివరకే స్పందించారు. అతడు ఎలాంటి ఏజ్ ఫ్రాడ్ చేయలేదని, 8 ఏళ్ల వయసులోనే బీసీసీఐ బోన్ టెస్ట్‌కు హాజరయ్యాడని వెల్లడించాడు. అనుమానం ఉన్నవాళ్లు మరోసారి టెస్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చని సవాల్ విసిరాడు.
ఇక ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 1.10 కోట్లు పలికి వైభవ్ సూర్యవంశీ.. ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అతడిని రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఇక అండర్ 19 ఆసియా కప్ టోర్నీలో అతడు అద్భుత ప్రదర్శన కనబర్చాడు. యూఏఈతో మ్యాచులో 46బంతుల్లో 76 పరుగులు స్కోరు చేశాడు. అందులో 6 సిక్స్‌లు ఉన్నాయి. శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో 36 బంతుల్లో 67 పరుగులు స్కోరు చేసి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇందులో 5 సిక్స్‌లు ఉన్నాయి. అయితే ఫైనల్‌లో భారత్.. బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ విఫలమయ్యాడు.