ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సొంత ఇల్లు కొనాలా.. అద్దెకు ఉండాలా? రెండింటిలో ఏది బెటర్

business |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2024, 09:11 PM

ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి అవసరం. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఎంత కష్టమైనా, లక్షల రూపాయలు వెచ్చించి సొంతింటి కలను నెరవేర్చుకుంటారు. ఇటీవలి కాలంలో హోమ్ లోన్ తీసుకుని తమ కలను నెరవేర్చుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. మధ్య తరగతి వారికి, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి సొంత ఇల్లు అనేది ఇప్పటికీ ఒక పెద్ద కలేనని చెప్పవచ్చు. కొందరు ఇంటి కోసం డబ్బులు పోగేసేందుకు అద్దె చెల్లించి జీవనం సాగిస్తున్నారు. మరికొందరు వారి ఆర్థిక స్థితిగతులను బట్టి సొంత ఇల్లు కొనుగోలు చేసి అందులో నివశిస్తున్నారు. అయితే, దీర్ఘకాలంలో సొంత ఇల్లు కొనడం మంచిదా లేదా అద్దెకు ఉండడమే మంచిదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిని అయోమయంలో పడేస్తుంది. అయితే, ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనే విషయాన్ని తేల్చుకునేందుకు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.


సొంతిల్లు ప్రయోజనాలు..


సొంత ఇల్లు ఉండడం వల్ల తాము ఉన్నంతకాలం చిరస్థాయిగా ఉండడంతో పాటు తర్వాత వారసులకు ఆస్తిగా ఇవ్వొచ్చని చాలా మంది భావిస్తారు. సొంతింటి కోసం బ్యాంకు రుణం తీసుకుని కొనుగోలు చేస్తారు. సొంత ఇల్లు ఉండడం వల్ల శాశ్వత చిరునామా లభిస్తుంది. సమాజంలో స్థాయి పెరుగుతుంది. ఇంటిని నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. కాస్త ఎక్కువ ఖర్చు అయినా ఆస్తిని సొంతంగా అనుభవిస్తున్నామనే భావనే ఉంటుంది. తరుచూ ఇల్లు మారాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో పెద్ద వయసువారు ఉంటే త్వరగా అద్దె ఇల్లు దొరకదనే చెప్పాలి. ఇలాంటి వారికి సొంత ఇల్లు ఉండడం మంచి ఆలోచనగా చెప్పవచ్చు.


సొంతిల్లు ఉండడం వ్యక్తిగత విజయానికి చిహ్నంగా చెబుతారు. ఒకే చోట ఎక్కువ కాలం స్థిరపడవచ్చు. కుటుంబ పరమైన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాలు చేసే వారికి ఈజీగా లోన్స్ లభిస్తాయి. పిల్లల ఉన్నత చదువులకు డబ్బుల కోసం ఇంటిని తనఖా పెట్టవచ్చు. ఇండిపెండెంట్ ఇంటిలో అదనపు గదులు ఉంటే అద్దెకు ఇచ్చి ఆదాయం పొందవచ్చు. ఉద్యోగులు, వ్యాపారులకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.


అద్దె ఇంటిలో ప్రయోజనాలు..


అద్దె ఇంట్లో ఉండే వారికి కొంత వరకు స్వేచ్ఛ తక్కువగా ఉంటుంది. నీటి వాడకం, బంధుమిత్రుల రాకపోకల విషయంలో ఆంక్షలు ఉంటాయి. ఇంటి యజమాని కండీషన్లను బట్టి మసులుకోవాలి. కొన్నిసార్లు అత్యవసరంగా ఇంటిని ఖాళీ చేయాల్సి రావచ్చు. ప్రతి ఏడాది ఇంటి అద్దెలు పెరుగుతూ అదనపు భారం పడుతుంది. కచ్చితంగా చెల్లించాలి. ఇంట్లో ఇష్టం వచ్చినట్లు మార్పులు, చేర్పులు చేసుకోలేం. నచ్చినా, నచ్చకపోయినా ఉండాల్సి రావచ్చు. అద్దె ఇంటిలో దీర్ఘకాలం కొనసాగే అనుభవం చాలా మందికి ఇబ్బందిగానే ఉంటుంది.


కానీ, అద్దె ఇంటిలో ఉండే వారికి ఆర్థిక స్వేచ్ఛ ఉంటుందని చెప్పవచ్చు. ఇంటిపై హక్కులు లేనప్పటికీ ఆర్థిక బాధ్యతలు చాలా తక్కువే ఉంటాయి. హోమ్ లోన్ తీసుకుని ఇంటిని కొంటే 10-20 శాతం డౌన్ పేమెంట్ కట్టాలి. ఉదాహరణకు రూ.50 లక్షల లోన్ తీసుకుంటే 20 సంవత్సరాల పాటు ఏడాదికి సగటున నెలకు రూ.45 వేల వరకు ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది. సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ఇంత పెద్ద మొత్తం చెల్లించడం కష్టమవుతుంది. ఈఎంఐలో మూడో వంతు చెల్లిస్తూ సౌకర్యవంతమైన అద్దె ఇంటిలో ఉండవచ్చు. ఇక పిల్లల చదువుల కోసం లోన్ తీసుకుంటే అదనపు భారం అవుతుంది. ఇలాంటి సమయంలో అద్దెకు ఉండే వారు ఈఎంఐల భారం, ఆర్థిక ఒత్తిడులు లేకుండా జీవించవచ్చు. భవిష్యత్తులో చాలా ప్రయోజనాలు దక్కుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com