ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వీధి వ్యాపారుల కోసం తాజాగా కొత్త విధానం అమల్లోకి తీసుకొచ్చింది. కొత్త ప్రతిపాదన మేరకు వీధి వ్యాపారులు స్థిరమైన, ఆకర్షణీయ మైన స్థలాల్లో వ్యాపారం నిర్వహించుకునేలా ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొచ్చింది. నెల్లూరు మైపాడు రోడ్డులో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేలా తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారికి రుణాలతో పాటుగా అన్ని రకాలుగా ప్రభుత్వం మద్దతు గా నిలిచేలా మార్గదర్శకాలు ఖరారు చేసింది. వీధి వ్యాపారుల కోసం ఏపీ ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం కీలక పాలసీ తీసుకొచ్చింది. వీధి వ్యాపారుల జీవనోపాధిని మెరుగు పరిచేలా కొత్త నిర్ణయం అమలు చేయనుంది. వీధి వ్యాపారుల కోసం నగరాలు, పట్టణాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో 'స్మార్ట్ స్ట్రీట్ మార్కెట్ల'ను ఏర్పాటు చేసేలా వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దీని ద్వారా వీధుల్లో రద్దీని తగ్గించటంతో పాటుగా వారి జీవనోపాధికి మద్దతుగా నిలిచేలా కొత్త మార్గదర్శకాలు ఖరారయ్యాయి. వీధి వ్యాపారులకు మార్కెంట్ సౌకర్యాలను కల్పించేలా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని భావిస్తోంది. ఇందు కోసం స్వయం సహాయక సంఘాలలోని కుటుంబాలను కూడా ప్రోత్సహించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. వినూత్న ఆలోచన ఇందు కోసం ఈ ప్రాజెక్టు ను ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా నెల్లూరులో 200 దుకాణాలతో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ఏర్పాటుకు అనుమతించారు. కంటైనర్ మోడల్‌లో ఈ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం రూ.7 నుంచి రూ.9కోట్ల వరకు ఖర్చవు తుందని అంచనా. స్మార్ట్ స్ట్రీట్ మార్కెట్లలో వ్యాపారులకు అనుకూలమైన రూఫ్‌టాప్, స్థలం కేటాయింపు, సోలార్ ప్యానల్స్ ద్వారా రోజుకు 12.96 కిలోవాట్స్ సామర్థ్యంతో కంటైనర్, డిజిటల్ అనుసంధానం, తగిన భద్రతా ఏర్పాట్లను కల్పించనున్నారు. ఇందు కోసం లబ్దిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. అర్హత - మార్గదర్శకాలు 18 ఏళ్లు పైబడిన వారు అర్హులుగా పేర్కొంది. లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన తరువాత సోషల్ ఆడిట్ నిర్వహించిన తర్వాత తుది జాబితాను తయారు చేస్తారు. అదే విధంగా సంబంధిత టౌన్ వెండింగ్ కమిటీల సిఫార్సుల మేరకు మున్సిపల్ కమిషనర్లు వారికి వెండింగ్ కార్డులు, సర్టిఫికెట్లు జారీ చేయాలని నిర్ణయించారు. లాటరీ పద్ధతిలో షాపులు, స్థలాలను కేటాయించనున్నారు. షాపులు పొందిన వారికి వివిధ పథకాల కింద రుణ సౌకర్యం కోసం గ్రూపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీరి వ్యాపారాలను విస్తరించేలా సహకరించటం తో పాటుగా డిజిటల్ ఫైనాన్స్ పైన అవగాహన పెంచేలా ప్రభుత్వం కార్యక్రమాలు ఖరారు చేస్తోంది.