బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడేందుకు భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియాలో గెలవాలంటే కేవలం ఆట ఒక్కటే ఉంటే సరిపోదు. ఆటతో పాటు మాటలూ ఉండాల్సిందే. ఎందుకంటే ఆ జట్టు ఆటగాళ్లు గెలిచేందుకు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. మాటలతో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను కవ్విస్తుంటారు. వారికి తోడు ఆ జట్టు మాజీలు, ఆ దేశ మీడియా కూడా ఛాన్స్ దొరికితే భారత ఆటగాళ్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈసారి కూడా ఆ దేశ మీడియా అదే చేస్తోంది.
ఇటీవల మెల్బోర్న్ ఎయిర్‌పోర్టులో కోహ్లీతో ఆస్ట్రేలియా మహిళా రిపోర్టర్ వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. తన భార్య, పిల్లల ఫొటోలను తీసేందుకు వీడియో గ్రాఫర్లు ప్రయత్నించగా.. కోహ్లీ అడ్డుచెప్పాడు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. మెల్బోర్న్లో నాలుగో టెస్టుకు ముందు భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మీడియా సమావేశం నిర్వహించాడు. ఈ విషయంపై కూడా ఆస్ట్రేలియా మీడియా అక్కసు వెళ్లగక్కింది.
సాధారణంగా రవీంద్ర జడేజా ఎక్కడ మీడియాతో మాట్లాడినా.. హిందీలోనే మాట్లాడతాడు. ఇంగ్లీష్‌లో ఎక్కువగా మాట్లాడడు. నాలుగో టెస్టుకు ముందు కూడా జడ్డూ ఇదే చేశాడు. మీడియా సమావేశంలో భారత మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చాడు. పూర్తిగా హిందీలోనే మాట్లాడాడు. అయితే తమ ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇవ్వాలని, ఇంగ్లీష్ మాట్లాడాలని ఆస్ట్రేలియా మీడియా డిమాండ్ చేసింది. కానీ జడేజా అవేమీ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు.
తమ దేశ మీడియాను భారత ఆటగాళ్లు పట్టించుకోవడం లేదంటూ ఆస్ట్రేలియా.. తమ ఛానెల్స్‌లో బులిటెన్స్ నడిపించింది. భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియా మీడియా అంటే నిర్లక్ష్యంగా ఉంటున్నారని, పట్టించుకోవడం లేదని, ఇది తమను అవమానపర్చడమే అని అందులో పేర్కొంది. అయితే వాస్తవానికి జడేజా చేసినదాంట్లో తప్పేమి లేదని తెలుస్తోంది. ఇది భారతీయ మీడియా కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్ అని సమాచారం. అందుకో జడేజా ఆస్ట్రేలియా మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. కాగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు ఈనెల 26 నుంచి మెల్బోర్న్ వేదికగా ప్రారంభం కానుంది.