టీమిండియా బ్యాటర్ పృథ్వీ షా ఇటీవల ఎక్కువగా వార్తల్లోకి వస్తున్నాడు. తన ఆట, ఫిట్నెస్, సోషల్ మీడియాలో పోస్టులతో అతడి పేరు చర్చల్లో ఉంటోంది. అయితే, తాజాగా అతడు చేసిన మరో పోస్టుపై పెద్ద దుమారం రేగుతోంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ జట్టులో సభ్యుడిగా ఉన్న అతడిపై ముంబై క్రికెట్ అసోసియేషన్ వేటు వేసింది. విజయ్ హజారే ట్రోఫీ మ్యాచులకు ఎంపిక చేయలేదు.
తనను ఎంపిక చేయకపోవడంపై పృథ్వీ షా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ‘చెప్పు దేవుడా.. నేను ఇంకా ఏం చూడాలి. విజయ్ హజారే ట్రోఫీలో 65 ఇన్నింగ్స్‌లలో 55.7 సగటు, 126 స్ట్రైక్ రేటుతో 3,399 రన్స్ చేసినా.. నన్ను ఎంపిక చేయరా.. నేను ఈ టోర్నీ ఆడేందుకు అర్హుడిని కానా? అయినా నీపై నమ్మకాన్ని వీడను దేవుడా. కచ్చితంగా తిరిగొస్తాం. ఓ సాయిరాం’ అని ఇన్‌స్టా స్టోరీ పెట్టాడు పృథ్వీ షా.
అయితే పృథ్వీ షా పెట్టిన పోస్టును ఉద్దేశించి ముంబై క్రికెట్ అసోసియేషన్ స్పందించింది. ఈ మేరకు ఓ అధికారి పృథ్వీ షాను తప్పించేందుకు కారణాలు వెల్లడించాడు. ఫిట్నెస్, క్రమశిక్షణ, ప్రవర్తన సరిగా లేకపోవడమే.. అతడిపై వేటు పడేందుకు కారణమని చెప్పుకొచ్చాడు. అతడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
‘ఇటీవల జరిగిన సయ్యద్ మస్తాక్ అలీ ట్రోఫీలో 10 మంది ఫీల్డర్లతోనే ఆడాం. పృథ్వీ షా ఫీల్డ్‌లో ఉన్నా.. లేనట్లే. ఎందుకంటే పక్క నుంచి బంతి వెళ్లినా దాన్ని పట్టుకోలేడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా.. సరైన సమయంలో బంతిని హిట్ చేయడంలో ఇబ్బంది పడ్డాడు. అంతేకాకుండా పృథ్వీ షా ఫిట్నెస్, క్రమశిక్షణ, ప్రవర్తన కూడా సరిగాలేవు. జట్టులో ఉండే సీనియర్లు కూడా అతడిపై కంప్లైట్స్ చేస్తున్నారు’ అని ఆ అధికారి అన్నారు.
‘సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు.. ముంబై సెలక్టర్లు, క్రికెట్ అసోసియేషన్‌పై ప్రభావం చూపిస్తాయనుకోవడం భ్రమే. పృథ్వీ షాకు శత్రువులు ఎవరో కాదు.. తనకి తానే శత్రువు’ అని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై ఛాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నీలో 9 మ్యాచులు ఆడిన పృథ్వీ షా.. 197 రన్స్ స్కోరు చేశాడు.