గత ఆర్థిక సంవత్సరం 2023-24 (అసెస్మెంట్ ఇయర్ 2024-25)కి సంబంధించి ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు జులై 31తో ముగిసింది. అయితే, ఈ గడువులోపు ఫైల్ చేయని వారికి, ఏదైనా తప్పులు ఉంటే సవరించుకునేందుకు డిసెంబర్ 31, 2024 వరకు అవకాశం ఉంటుంది. దీనినే బిలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ అని కూడా అంటారు. నామమాత్రము జరిమానాలు, బకాయిలపై వడ్డీ చెల్లించి ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. మరి ఈ డిసెంబర్ గడువు సైతం మిస్సయితే ఎలా? ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? అనేది ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేసేందుకు డిసెంబర్ 31 వరకు గడువు ఉంటుంది. రూ.5 లక్షల లోపు పన్ను ఆదాయం ఉన్న వారు రూ.1000, ఆపైన ఆదాయం ఉన్న వారు రూ.5 వేల జరిమానా కట్టాలి. అలాగే బకాయిలపై ఆదాయపు పన్ను చట్టం 1961లోని వివిధ 234 సెక్షన్ల కింద వడ్డీ పడుతుంది. అయితే, డిసెంబర్ 31 గడువు సైతం మిస్సయితే చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ గడువు తర్వాత ప్రత్యేక అనుమతితో రిటైర్న్ ఫైల్ చేసినా రీఫండ్ రాదు. అంటే మీరు ట్యాక్స్ చెల్లిస్తున్నారని చెప్పడానికే ఇది ఉపయోగపడుతుంది. రీఫండ్ కోల్పోవడంతో పాటు పెనాల్టీలు, జరిమానాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేస్తే కొత్త పన్ను విధానం మాత్రమే ఎంచుకోవాలి. దీంతో ట్యాక్స్ మినహాయింపులు క్లెయిమ్ చేసుకోలేరు. కొత్త పన్ను విధానంలో ఆదాయ పన్ను పత్రాలను సమర్పించాల్సి రావడం వల్ల ట్యాక్స్ పేయర్ ఈ ప్రయోజనాలన్ని కోల్పోవాల్సి వస్తుంది.
వారికి 7 ఏళ్ల జైలు శిక్ష..
మీరు డిసెంబర్ 31, 2024 లోపు బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయలేకపోతే ఆదాయపు పన్ను విభాగం చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 276cc కింద చర్యల తీసుకుంటుంది. ప్రత్యేక కేసుల్లో కావాలని రిటర్న్స్ ఫైల్ చేయకుండా ఉన్న వారికి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలాగే ఆలస్యంగా ఫైల్ చేసినందుకు జరిమానాలు, వడ్డీతో పాటు చట్టపరమైన చర్యలు, మానీటరీ ఫైన్స్ ఉంటాయి.