ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త ఏడాదిలో హెల్తీగా ఉండాలంటే..

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Dec 27, 2024, 03:25 PM

క్యాలెండర్ మారడానికి ఇంకొద్ది రోజుల సమయమే ఉంది. కొత్త సంవత్సరంలో ఐనా గత ఏడాది చేయలేకపోయిన పనులు పూర్తి చేయాలని, ఆశలు, ఆశయాలు నెరవేర్చుకోవాలని ఇప్పటికే ప్రణాళికలు మొదలుపెట్టేసుంటారు చాలామంది.ఆ జాబితాలో ఆరోగ్యం, ఫిట్‌నెస్ కూడా ఉండే ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యమనే నానుడి అందరికీ తెలిసిందే. మీ భవిష్యత్ లక్ష్యాలను సాధించాలంటే ఆరోగ్యంగా ఉండటమూ ఎంతో అవసరం కదా. అది అనుకున్నంత తేలిక కాకపోవచ్చు. కానీ, రోజుకో అడుగు చొప్పున లక్ష్యం వైపు పయనించినా ఏడాది చివరికి గమ్యం చేరుకునే అవకాశం ఉంటుంది కదా. అయితే, మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు ఎన్నో మార్గాలు ఉంటాయి. అన్నింటికంటే ఉత్తమమైన వాటిల్లో ఒకటే ఆయుర్వేదం. ఈ విధానంలో మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ సహజ పద్ధతుల్లో పెద్దగా శ్రమ పడకుండానే కొత్త సంవత్సరంలో మానసిక, శారీరక రుగ్మతల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.


ప్రస్తుతం భారతీయులు తమ సంపాదనలో ఎక్కువ భాగం ఖర్చుచేస్తున్నది ఆరోగ్యం కోసమే. చిన్నపాటి జ్వరం వచ్చిందని ఆస్పత్రిలో అడుగుపెట్టినా చాలు. మీ జేబులు ఖాళీ అవ్వాల్సిందే. అందుకే ప్రపంచంలో ప్రాచీన వైద్యశాస్త్రాల్లో ఒకటిగా పేరొందిన ఆయుర్వేద వైద్యానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా 'ఆయుష్' మంత్రిత్వ శాఖ ద్వారా ఆయుర్వేద వైద్య ప్రయోజనాలు ప్రజలకు నేరుగా అందించేందుకు, వైద్య విధానాల అభివృద్ధికి కృషిచేస్తోంది.జలుబు మొదలుకుని దీర్ఘకాల వ్యాధుల వరకూ వేటినైనా నయం చేయగలిగే పద్ధతులు ఆయుర్వేదంలో ఉన్నాయి. ప్రకృతి నుంచి లభించే మొక్కలు, మూలికలతోనే క్యాన్సర్ వంటి రుగ్మతలు నయం చేయవచ్చని వివిధ పరిశోధనల్లో వెల్లడైంది. ఈ మధ్య చాలామంది తక్కువ సమయంలోనే అధిక బరువు తగ్గించుకునేందుకు, ఇన్‌ఫ్లమేషన్ నివారణకు ఆయుర్వేద చిట్కాలపై ఆధారపడుతున్నారు.


బరువు పెరగకుండా నిరోధించడం


బరువు తగ్గించుకునేందుకు ధూమపానం అలవాటు మానుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి కనీసం 8 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. బీపీ, షుగర్ నియంత్రణలో ఉంచుకుంటూ క్రమం తప్పకుండా వర్కౌట్లు, ధ్యానం వంటివి చేస్తే అధిక బరువును తగ్గించుకోవచ్చు.


శారీరక శ్రమ
ప్రతిరోజూ శారీరక శ్రమ చేయడం చాలా ముఖ్యం. దీంతో మీ శరీరంతో పాటు మనసూ ఉత్తేజితమవుతుంది. మంచి నిద్ర పట్టేందుకు దోహదం చేస్తుంది. మీ ఒత్తిడిని తగ్గించి రక్తపోటు అదుపులో ఉంచేందుకు సాయపడుతుంది.


గుండె ఆరోగ్యం
ఒక టీస్పూన్ అర్జున బార్క్ (అర్జున్ కి చాల్), 2 గ్రాముల దాల్చిన చెక్క, 5 తులసి ఆకులను ఉడికించి తయారుచేసిన డికాషన్ ప్రతిరోజూ తాగండి. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.


మెరుగైన కాలేయ ఆరోగ్యం
శరీరంలో అతికీలకమైన అవయాల్లో ఒకటి కాలేయం. అధిక రక్తపోటు, అధిక షుగర్, అధిక కొలెస్ట్రాల్ కారణంగా కాలేయం దెబ్బతింటుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటే కాలేయాన్ని సంరక్షించుకునేందుకు అవకాశం ఉంటుంది.


ఊపిరితిత్తుల ఆరోగ్యం
ప్రాణాయామాన్ని దినచర్యలో భాగం చేసుకుంటే ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుంది. శ్వాసకోసవ్యాధులను తగ్గించుకునేందుకు పసుపు వేసిన పాలు తాగుతుండాలి. వేయించిన ఆహారానికి దూరంగా ఉంటే మేలు.


కిడ్నీ ఆరోగ్యం
శరీరంలోని మలినాలను వేరుపరచి శరీరం సక్రమంగా పనిచేసేలా చేస్తాయి కిడ్నీలు. ఇవి ఆరోగ్యంగా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. బరువు నియంత్రణలో ఉంచుకోవాలి. సరిపడినంత నీరు తీసుకోవడం మర్చిపోవద్దు. జంక్‌ఫుడ్, ధూమపానానికి దూరంగా ఉండాలి. నొప్పి నివారణ మందులు తీసుకోకపోవటమే మంచిది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com