ఆహారం నేరుగా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మనం ఏది తిన్నా, ఏ సమయంలో తిన్నా అది ఆరోగ్యంపైనే ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అందుకే సరైన సమయంలో.. సరైన ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఉదయం పూట భారీగా బ్రేక్ ఫాస్ట్, రాత్రి సమయాల్లో తేలికపాటి భోజనం చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే, చాలా మంది ఎలా పడితే అలా తింటున్నారు. దీంతో లేని పోని రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ రోజుల్లో ఏం సమయంలో ఏం తింటే ఆరోగ్యానికి మంచిదో పూర్తి అవగాహన ఉండాలి.
ఇక, చాలా మంది ఆరోగ్యానికి మంచిదని పండ్లు తింటారు. పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే పండ్లను సలాడ్, జ్యూస్ రూపంలో తీసుకుంటారు. అయితే, తెలియక తెలిసో కొందరు కొన్ని పండ్లను కలిపి తింటారు. కొన్ని పండ్లను వేర్వేరుగా తింటేనే ఆరోగ్యానికి మంచిది. ఈ పండ్లను కలిపి తింటే ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, పండ్లను కలిపి జ్యూస్ చేసుకుని తాగుతుంటారు. కొన్ని రకాల పండ్లను ఎట్టి పరిస్థితుల్లో కలిపి తినకూడదు. తింటే ఆరోగ్యానికి డేంజర్. ఆ పండ్ల లిస్ట్ ఏంటో ఓ లుక్కేద్దాం.
అరటి పండు, నారింజ..
సాధారణంగా అరటి పండు, నారింజ వేర్వేరుగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెండింటిలో శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ రెండింటిని వేర్వేరుగా తింటే ఇమ్యూనిటీ పవర్ పెరిగి.. రోగాల్ని తట్టుకునే శక్తి వస్తుంది. అయితే, ఈ రెండింటిని కలిపి ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు. అంతేకాకుండా వీటిని కలిపి జ్యూస్ చేసుకుని కూడా తాగకూడదు. ఇలా చేయడం వల్ల కడుపులో గందరగోళం ఏర్పడుతుంది. జీర్ణక్రియ మందగిస్తుంది. పొట్టలో ఆమ్లత్వం పెరుగుతుంది. దీంతో.. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కడుపులో గ్యాస్ పెరిగి అసౌకర్యంగా ఉంటుంది.
నారింజ, యాపిల్..
యాపిల్‌లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలతో నిండి ఉంటుంది. అందుకే రోజుకు ఒక్క యాపిల్ అయినా సరే తినాలంటారు. అయితే, అదే యాపిల్ పండును నారింజతో కలిపి తినకూడదు. అంతేకాకుండా ఈ రెండింటిని కలిపి జ్యూస్ చేసుకుని తాగకూడదు. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు పెరుగుతాయి. ఇప్పటికే జీర్ణసమస్యలతో బాధపడేవారు ఈ ఫ్రూట్ కాంబినేషన్‌ను అవాయిడ్ చేయండి. పొరపాటున ఈ రెండింటిని తినడం వల్ల గ్యాస్, పుల్లటి తేన్పులు, అజీర్తి, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
జామ, అరటి పండు..
జామపండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. చలికాలంలో జామపండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. జామపండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీంతో.. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. రోగాలు రాకుండా అడ్డుకుంటుంది. ఇందులో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో.. మలబద్ధక సమస్యతో బాధపడేవారికి జామపండు అద్భుతంగా పనిచేస్తుంది. కానీ, జామను అరటి పండుతో కలిపి తినకూడదు. ఎందుకంటే ఈ రెండింటిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో.. ఈ రెండూ పండ్లు జీర్ణమవ్వడం కష్టంగా ఉంటుంది. దీంతో.. జీర్ణక్రియ మందగిస్తుంది. కడుపు నొప్పి, మలబద్ధకం సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదముంది. అందుకే ఈ రెండింటిని కలిపి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
బొప్పాయి, నిమ్మ..
బొప్పాయి, నిమ్మ వేర్వేరుగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ రెండింటిలో విటమిన్ సి ఉంటుంది. దీంతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. చలికాలంలో ఈ రెండింటిని వేర్వేరుగా తినడం వల్ల రోగాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. అయితే, ఈ రెండింటిని కలిపి తింటే మాత్రం కడుపులో గందరగోళం ఖాయమంటున్నారు. ఈ రెండింటి కాంబినేషన్ వల్ల కడుపులో గ్యాస్ ఎక్కువ అవుతుంది. దీంతో.. ఉబ్బరం, కడుపు నొప్పి, వికారం, వాంతులయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ రెండు పండ్లను కలిపి తీసుకోకూడదు.
పుచ్చకాయ, అరటి పండు..
పుచ్చకాయ, అరటి పండు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండింటిని ఎట్టి పరిస్థితుల్లో కలిపి తినకూడదు. జ్యూస్ చేసుకుని తాగకూడదు. ఎందుకంటే పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అరటి పండులో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ నిదానిస్తుంది. దీంతో కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే, వీటిని వేర్వేరుగా తింటే మాత్రం ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
ఈ పండ్లు కూడా కలిపి తినకూడదు..
* మామిడి, పైనాపిల్
* క్యారెట్, నారింజ
* నేరేడు, దానిమ్మ
* పైన చెప్పిన పండ్లను కలిపి తినడం వల్ల కడుపులో గందరగోళం ఏర్పడుతుంది. అంతేకాకుండా కిడ్నీలపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ పండ్లను కలిపి ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని నిపుణులు చెబుతున్నారు.