ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో భారత బౌలర్లు గట్టి కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్.. 185 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. ఓ పక్క కెప్టెన్ బుమ్రా.. అనూహ్యంగా మైదానాన్ని వీడినా.. ఆసీస్ బ్యాటర్లను భయపెట్టారు. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలతో పాటు.. నితీశ్ రెడ్డీ వికెట్ల వేటలో పాలుపంచుకోవడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 4 పరుగుల లీడ్ లభించింది.
ఓవర్ నైట్ స్కోరు 9/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. జట్టు స్కోరు 15 వద్ద మార్నస్ లబుషేన్ (2)ను బుమ్రా ఔట్ చేశాడు. ఆ తర్వాత కాసేపు నిలబడ్డ సామ్ కొన్‌స్టాస్, స్టీవ్ స్మిత్‌లు కూడా తొలి సెషన్‌లోనే ఔట్ అయ్యారు. భారత్‌కు కొరకరాని కొయ్యగా తయారైన ట్రావిస్ హెడ్‌ను కూడా సిరాజ్.. ఔట్ చేశాడు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 29 ఓవర్లలో 101/5తో నిలిచింది.
ఆ తర్వాత రెండో సెషన్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. మరో 80 పరుగులు జోడించి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ ఇన్నింగ్స్‌లో బుమ్రా 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేశాడు. 33 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత డాక్టర్‌తో కలిసి మైదానాన్ని వీడాడు. దీంతో బౌలింగ్ దళాన్ని నడిపే బాధ్యతలను సిరాజ్ తీసుకున్నాడు. అతడికి ప్రసిద్ధ్ కృష్ణ, నితీశ్‌లు కూడా చక్కటి సహకారం అందించారు. దీంతో ఆస్ట్రేలియా 181 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు మూడేసి వికెట్ల చొప్పున తీశారు. జస్‌ప్రీత్ బుమ్రా 2, నితీశ్ రెడ్డి 2వికెట్లు పడగొట్టారు.
ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా 2-1తో లీడ్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి.. సిరీస్‌ను రిటైన్ చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇదే సమయంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలనూ సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది.