టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలో టెస్టులకు గుడ్‌బై చెప్పనున్నాడని.. అతడి కెరీర్‌లో మెల్‌బోర్న్ టెస్టే చివరిదని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కోచ్ గంభీర్‌తో రోహిత్‌కు విబేధాలు ఏర్పడ్డాయని.. అతడి టెస్టు కెరీర్ ముగిసిపోయిందనే వార్తలు వచ్చాయి. సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ శర్మ తప్పుకోవడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. అయితే తాజాగా ఈ ప్రచారానికి రోహిత్ శర్మ చెక్ పెట్టాడు. సిడ్నీ టెస్టులో లంచ్ బ్రేక్ సమయంలో ఇర్ఫాన్ పఠాన్‌కు.. రోహిత్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చేశాడు.
జట్టు అవసరాలే ముఖ్యమన భావించి.. సిడ్నీ టెస్టు నుంచి తప్పుకున్నట్లు రోహిత్ శర్మ చెప్పాడు. ఇది తాను తీసుకున్న నిర్ణయమని వెల్లడించాడు. దీనిపై టీమిండియా మేనేజ్‌మెంట్‌తో చర్చించినట్లు చెప్పాడు. ఇదే సమయంలో రిటైర్మెంట్ పుకార్లపై కూడా క్లారిటీ ఇచ్చాడు.
"నేను ఆటకు వీడ్కోలు పలకబోవడం లేదు. సిడ్నీ టెస్టు నుంచి మాత్రమే తప్పుకున్నా. ఎందుకంటే జట్టు అవసరాలే నాకు ముఖ్యం. పెర్త్ టెస్టులో యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్‌లు కీలక భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. అందుకే నేను 2, 3 టెస్టుల్లో ఆరో స్థానంలో ఆడాను. ఇది చాలా సున్నితమైన నిర్ణయమే అయినా.. జట్టు ప్రయోజనాలే నాకు ముఖ్యం. ఫస్టు జట్టు.. ఆ తర్వాతే నేను. ప్రస్తుతం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ ప్రశాంతంగా ఉంది. ఎటువంటి సమస్యా లేదు. ఏదో జరుగుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మనం నియంత్రించలేం" అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.
భవిష్యత్ ప్లాన్స్‌పై..
"ఇప్పుడు నేను ఫామ్‌లో లేను. నా బ్యాట్ నుంచి పరుగులు రావడం లేదు. కాన వచ్చే 4, 5 నెలలు ఎలా ఉంటాయో ఎవరు చెప్పగలరు? నేను రన్స్ చేయనని ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? ఫామ్ కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటా. ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుని ఉండేవారో.. పేపర్, పెన్నులు చేతపట్టుకున్నవారో.. నా రిటైర్మెంట్‌ను డిసైడ్ చేయలేరు. నేను ఇద్దరు పిల్లల తండ్రిని. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు" అని టీమిండియా కెప్టెన్ తన కౌంటర్ ఇచ్చాడు.