ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన టీమిండియా.. అప్‌కమింగ్ సిరీస్‌లపై ఫోకస్ పెట్టింది. ఈ నెల చివర్లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనున్న టీమిండియా..వచ్చే నెలలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బరిలోకి దిగనుంది. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 9 వరకు పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో జరగనున్న విషయం తెలిసిందే.భారత మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఈ టోర్నీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా సన్నాహకంగా వాడుకోనుంది. ఐసీసీ డెడ్‌లైన్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగే జట్లను జనవరి 12లోపు ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలోనే భారత సెలెక్టర్లు భారత జట్టు ఎంపికపై ఫోకస్ పెట్టారు. ముందుగా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసి ఆ తర్వాత మార్పులు చేర్పులు చేయనున్నారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యం నేపథ్యంలో సెలెక్టర్లు ఆచితూచి జట్టును ఎంపిక చేయనున్నారు. భారత్ మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. అక్కడి పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండనున్నాయి. దాంతో భారత జట్టులో స్పిన్నర్లకు అధిక ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది.
స్పిన్ ఆల్‌రౌండర్స్ రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌తో పాటు కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్‌ల పేర్లను సెలెక్టర్లు పరిశీలించనున్నారు. ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ సర్జరీ చేయించుకొని గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతను పూర్తి ఫిట్‌గా లేకుంటే రవి బిష్ణోయ్‌కు మార్గం సుగుమం కానుంది.
చీల మండ గాయంతో భారత జట్టుకు దూరమైన స్టార్ పేసర్ మహమ్మద్ షమీ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికవ్వనున్నాడు. ఒకవేళ సెలెక్టర్లు అతన్ని పరిశీలనలోకి తీసుకుంటే ముందుగా ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడించనున్నాడు. ఆ సిరీస్‌ల ప్రదర్శన ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయనున్నారు.
సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ జట్టులో చోటు దక్కించుకోనున్నారు. అయితే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శనను నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ కూడా భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. పేస్ విభాగాన్ని అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీల సాయంతో బుమ్రా నడిపించనున్నాడు. సిరాజ్ విషయంలో పునరాలోచన చేయనున్నారు. సిరాజ్‌కు ఆకాశ్ దీప్, హర్షిత్ రాణాల నుంచి తీవ్ర పోటీ నెలకొంది.
స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కనుంది. సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‌కు మరోసారి నిరాశే ఎదురవ్వనుంది. కేఎల్ రాహుల్‌ను బ్యాకప్ వికెట్ కీపర్‌గా పరిగణించనున్నారు. ఒకవేళ కేఎల్ రాహుల్‌ను పక్కనపెడితే ధ్రువ్ జురెల్ లేదా సంజూ శాంసన్‌కు అవకాశం దక్కవచ్చు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఎంపికయ్యే భారత జట్టు(అంచనా):
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్/ కుల్దీప్ యాదవ్/రవిబిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.