టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన సతీమణి ధనశ్రీ వర్మ నుంచి విడిపోయారా? వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకోవడం, ఫొటోలు డిలీట్ చేసుకోవడం వంటి చర్యలు విడాకుల ఊహాగానాలకు రేకెత్తించాయి. దీంతో చాహల్, ధనశ్రీలు త్వరలో విడాకులు తీసుకోనున్నారని.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఇద్దరు ఒకరి ఖాతాను మరొకరు అన్‌ఫాలో అయ్యారు. అంతే కాకుండా ధనశ్రీ కలిసి దిగిన ఫొటోలనూ యుజ్వేంద్ర చాహల్ తొలగించాడు. అయితే విడాకుల విషయాన్ని వారి సన్నిహితులు ధ్రువీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.
“చాహల్-ధనశ్రీలు విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు కాస్త సమయం పడుతోంది. వీరిద్దరూ ఎందుకు విడిపోతున్నారు? అనే కారణాలు మాత్రం తెలియలేదు” అని వార్తా కథనాలు పేర్కొన్నాయి.
ఈ వార్తలు బయటకు వచ్చిన తర్వాత చాహల్ ఆసక్తికర పోస్టు పెట్టాడు. “కష్టపడి పని చేయడం వ్యక్తులకు గుర్తింపు తెస్తుంది. మీ ప్రయాణం మీకు తెలుసు. మీ బాధ మీకు తెలుసు. ఇక్కడికి చేరుకోవడానికి ఏం చేశారో మీకు తెలుసు. ప్రపంచానికి కూడా తెలుసు. మీరు గర్వంగా నిలబడండి. మీ తల్లిదండ్రులను గర్వపడేలా చేసేందుకు మీరు కష్టపడ్డారు. వారు ఎల్లప్పుడూ గర్వించే కొడుకుగా ఉండండి” అని చాహల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు.
కాగా యుజ్వేంద్ర చాహల్.. ధనశ్రీ వర్మను 2020లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ధనశ్రీ వర్మ ముంబైకి చెందిన డెంటిస్ట్, డ్యాన్స్ కొరియోగ్రాఫర్. కరోనా లాక్డౌన్ సమయంలో ఆమె వద్ద డ్యాన్స్ నేర్చుకునేందుకు వెళ్లిన చాహల్.. ప్రేమలో పడ్డాడు. నాలుగేళ్ల పాటు కలిసి మెలిసి ఉన్న ఈ జంట మధ్య ఆరు నెలల నుంచి దూరం ఏర్పడినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం కూడా వీరి విడాకులపై రూమర్స్ వచ్చాయి. కానీ వాటిని వీరిద్దరూ ఖండించారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.