ఛాంపియన్స్ ట్రోఫీకి అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ వేదిక విషయంపై షెడ్యూల్ ప్రకటన ఆలస్యమైంది. హైబ్రిడ్ మోడల్ నిర్వహణకు పీసీబీ అంగీకరించకపోవడం కూడా టోర్నీ నిర్వహణపై అనుమానాలు రేకెత్తించింది. తాజాగా మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ వార్తల్లోకి వచ్చింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ సహా మొత్తం 8 దేశాలు ఆడనున్నాయి. టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడే 8 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. వీటిలో గ్రూప్-ఏలో పాకిస్థాన్, భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, అప్ఘానిస్థాన్, ఇంగ్లాండ్‌లు ఉన్నాయి. అంటే ఒక్కో జట్టు తమ గ్రూప్‌లోని మిగతా మూడు మ్యాచ్‌లలో లీగ్ దశలో తలపడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చింది.
అఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టుతో మ్యాచ్ ఆడొద్దంటూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుపై ఒత్తిళ్లు వస్తున్నాయి. ఈ మేరకు అఫ్ఘాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని 160 మందికి పైగా రాజకీయ నాయకులు ఈసీబీకి విజ్ఞప్తి చేశారు. మహిళల హక్కులపై ఆంక్షలు విధిస్తున్న అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వ ఆగడాలను అడ్డుకునేందుకు ఈ చర్య తీసుకోవాలని రాజకీయ నేతలు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డును కోరారు.
అయితే, ఇంగ్లండ్ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తిని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తిరస్కరించినట్లు సమాచారం. తాలిబన్ల పాలనలో మహిళలు, బాలికలపై వివక్షకు తాము వ్యతిరేకమని స్పష్టం చేసిన.. ఆఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్‌ను మాత్రం బహిష్కరించలేమని చెప్పిందట.
టోర్నీలో భాగంగా లాహోర్ వేదికగా ఇంగ్లాండ్, అఫ్ఘానిస్థాన్ జట్లు ఫిబ్రవరి 26న తలపడనున్నాయి. అయితే 2021 ఆగస్టులో అప్ఘానిస్థాన్‌లో ఏర్పడ్డ తాలిబన్ల ప్రభుత్వం.. మహిళపై తీవ్రస్థాయిలో ఆంక్షలు విధిస్తోంది. బాలికలు ఆరో తరగతికి మించి చదవకూడదని.. మహిళలు ఉద్యోగాలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో (జిమ్‌లు, పార్కులు) మహిళలు కనిపించకూడదని ఆంక్షలు విధించింది. మగ తోడు లేకుండా మహిళలు ప్రయాణం చేయకూడదని.. ఎట్టిపరిస్థితుల్లోనూ క్రీడల్లో పాల్గొనకూడదని ఆదేశించింది. ఈ కారణాలతోనే ఇంగ్లాండ్‌లోని రాజకీయ నాయకులు.. మ్యాచ్‌ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు.