బ్లడ్ టెస్ట్ అనగానే మనం షుగర్, కొలెస్టరాల్, థైరాయిడ్ పరీక్షలే చేయించుకుంటాం. జ్వరాల సీజన్ లో అయితే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధుల నిర్ధారణ కోసం రక్త నమూనాలు ఇస్తాం. కానీ మీరెప్పుడైనా క్లోరైడ్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారా? అదేం పరీక్ష, దానివల్ల ఏం లాభం అనుకుంటున్నారా? అయితే దీనిపై ఓ లుక్కేయండి.పొటాషియం, సోడియం, క్యాల్షియం లాగానే క్లోరైడ్ కూడా ఒక ఎలక్ట్రోలైట్. మన శరీరానికి అవసరమైన ఖనిజాల్లో ఇది కూడా ఒకటి. ఇది నీటిలో కరిగి ఉంటుంది. రక్తంలో పీహెచ్ స్థాయి సహా శరీర ద్రవాల సమతౌల్యతను కాపాడేందుకు దోహదపడుతుంది. రక్తపోటు, రక్త పరిమాణం తగిన స్థాయిలో ఉండేలా చూస్తుంది. మనం ఉపయోగించే సాధారణ ఉప్పు సోడియం క్లోరైడ్.. దీని నుంచే మన శరీరానికి క్లోరైడ్ లభిస్తుంటుంది.రక్తంలో క్లోరైడ్ స్థాయులను తెలుసుకోవడానికి చేసేదే క్లోరైడ్ బ్లడ్ టెస్ట్ లేదా సీరమ్ క్లోరైడ్ టెస్ట్. వాంతులు, విరేచనాలు, డీహైడ్రేషన్ తో బాధపడుతున్నప్పుడు లేదా కిడ్నీ, అడ్రినల్ గ్రంథి పనితీరు తెలుసుకోవడానికి ఈ రక్త పరీక్ష చేస్తారు. అలాగే హైబీపీ, హైపర్ హైడ్రోసిస్ (అధికంగా చెమటపట్టడం), కండరాల బలహీనత, శ్వాస సమస్యలు, నిస్సత్తువ, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా క్లోరైడ్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం అవసరం.పెద్దలకైతే 96 నుంచి 100 ఎంఈక్యూ\ఎల్ (ఎంఈక్యూ అంటే.. ప్రతి లీటర్ రక్తంలో వెయ్యో వంతుకు సమానం) మధ్య... పిల్లలకైతే 95 నుంచి 108 ఎంఈక్యూ\ఎల్ మధ్య, నవజాత శిశువులకైతే 96 నుంచి 113 ఎంఈక్యూ\ఎల్ మధ్య క్లోరైడ్ స్థాయి ఉండాలి. ఒకవేళ క్లోరైడ్ స్థాయి అంతకన్నా తక్కువగా లేదా ఎక్కువగా ఉంటే మీరు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అర్థం. అలాంటప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. క్లోరైడ్ హెచ్చుతగ్గులకుగల కారణాలు తెలుసుకోవడానికి డాక్టర్ మరిన్ని పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేయడంతోపాటు చికిత్స అందిస్తారు.