ఉపాధి హామీ పథకం ద్వారా రూ.350 కోట్లతో రాష్ట్రంలో గ్రామీణ రోడ్ల పనులు చేపడుతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం గజపతినగరం టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడునెలల్లోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయన్నారు. గజపతినగరం నియోజకవర్గం పరిధిలో బొండపల్లి మండలంలో తాగునీటిసమస్య తలెత్తకుండా పనులు వేగవంతంగా జరిగేలా అదికారులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. గజపతినగరం, దత్తిరాజేరు, మెంటాడ మం డలాలకు ఆర్టీసి బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గజపతినగరం మండలంలోని మరుపల్లిలో 80 ఎకరాల్లో ఫుడ్‌పార్క్ నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవడంతోపాటు అదనంగా వందఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌కు ప్రణాళికలు రూపొందించనున్నట్లు చెప్పారు. బొండపల్లి మండలంలో 50 ఎకరాలు స్థల సేకరణ చేపట్టి పరిశ్రమల ఏర్పాటకు ప్రతిపాదనలు చేశామన్నారు. గంట్యాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయర్ ఆధునికీకరణ పనులతోపాటు పర్యాటకాన్ని అభివృద్ధిచేశామన్నారు. రైతులకు గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను చెల్లింపులు చేపట్టడంతో పాటు ధాన్యం ఇచ్చిన రైతులకు 48గంటల్లో వారి ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేస్తోందన్నారు. మూడు లక్షలమెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా సంక్రాంతికి ముందే 70శాతం కొనుగోలు చేశామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పీవీవీ గోపాలరాజు, నాయకులు శీరం రెడ్డి రామ్‌కుమార్, ప్రదీప్ కుమార్, లెంక బంగారునాయుడు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు మక్కువ శ్రీధర్, దత్తిరాజేరు టీడీపీ మండలాధ్యక్షులు చప్పా చంద్రశేఖర్ పాల్గొన్నారు.