గుంతకల్లు పట్టణంలో జనన ధ్రువీకరణ పత్రాల జారీ, అందులో ఏవైనా తప్పులుంటే సరిదిద్దడానికి కొందరు ఉద్యోగులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో పాఠశాలలో అపార్ నమోదుకు తప్పులు లేని బర్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరడం అక్రమార్కులకు వరంగా మారింది. ఇదే అవకాశంగా బర్త్ సర్టిఫికెట్లు, సవరణల కోసం వచ్చే వారి నుంచి అందినకాడికి దోచేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ. 300 నుంచి రూ. 1000ల వరకూ వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. బర్త్ సర్టిఫికెట్ ఎంట్రీ లేకుంటే రూ. రెండు వేల నుంచి రూ. ఐదు వేల దాకా వసూలు చేస్తున్నారు. అసలు పట్టణంలో పుట్టకపోయినా డబ్బిస్తే చాలు బర్త్ సర్టిఫికెట్లు గుంతకల్లులో పొందవచ్చన్న చందంగా పరిస్థితి మారింది. ఇప్పటిదాకా దాదాపు 10 వేల సర్టిఫికెట్ల ఎంట్రీలు, సర్టిఫికెట్లలో పేర్ల నమోదు, పేర్ల సవరణ కారణాలతో రూ. అరకోటికి పైనే ప్రజల నుంచి దండుకు న్నారు. అపార్ నమోదుకు గడువు మార్చి దాకా ఉండటంతో బర్త్ సర్టిఫికెట్ల కోసం వచ్చే జనంతో గుంతకల్లులోని పురపాలక సంఘం, ప్రభుత్వ ఆసుపత్రి, తహసీల్దారు కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి.