ఇటీవలి కాలంలో చాలా మంది మధుమేహం (షుగర్) వ్యాధి బారినపడుతున్నారు. మారిన జీవన శైలి, జంక్ ఫుడ్ వంటివి ఎక్కువగా తీసుకోవడం, ఊబకాయం వంటివి దీనికి కారణం అవుతున్నాయి. మధుమేహం బారినపడినవారు వారి ఆహార అలవాట్లలో తప్పనిసరిగా మార్పులు చేసుకోవాల్సిందే. అయితే ఇందులోనూ ఒక అంశం చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలు తాజాగా ఓ పరిశోధనలో గుర్తించారు. ఆహారం తీసుకునే విషయంలో ఈ విధానం పాటిస్తే షుగర్ కంట్రోల్ లో ఉంచుకోవడం సులువని చెబుతున్నారు.మనుషులకు అయినా జంతువులకు అయినా అంతర్గతంగా జీవ గడియారం ఉంటుంది. దాన్ని సర్కాడియం రిథమ్ అంటారు. మనం దేనికైనా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అంటూ ప్లాన్ చేసుకున్నట్టే... జీవ గడియారం కూడా మన శారీరక విధులకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటుంది. ఉదయం మేల్కొనడం దగ్గరి నుంచి కాల కృత్యాలు, భోజనం, పని, నిద్ర, విశ్రాంతి.. ఇలా అన్నీ జీవ గడియారానికి అనుగుణంగా సాగితే ఎలాంటి సమస్యలూ ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధుమేహంతో బాధపడేవారు, మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నవారు ఇలా జీవ గడియారాన్ని అనుసరించి భోజనం చేస్తే మధుమేహం సమస్య దూరం అవుతుందని స్పష్టం చేస్తున్నారు.మనుషులు ప్రతి ఒక్కరిలో జీవ గడియారం కొంచెం అటూ ఇటూ మార్పులతో ఉంటుంది. అది వారు నివసించే ప్రాంతం, నిత్యం చేసే పనులు, వారి అలవాట్లకు అనుగుణంగా ఈ మార్పులు చెందుతుంది. రోజూ ఆయా సమయాల్లో శరీరంలో ఎంజైముల విడుదల, శక్తి స్థాయిల నియంత్రణ, ఇతర అంశాలు క్రమపద్ధతిలో జరుగుతాయి. ఇదే క్రమంలో భోజనానికి సంబంధించి కూడా నిర్దిష్టమైన సమయం ఉంటుంది. కొందరు రోజూ మూడు సార్లు నిర్దిష్టమైన సమయాల్లో టిఫిన్, భోజనం వంటివి చేస్తారు. మరికొందరు రెండు సార్లే తింటారు. ఎక్కువ లేదా తక్కువ సార్లు తిన్నా... ఆ సమయాల్లో కాకుండా వేరే సమయంలో తిన్నా... ఇబ్బందిగా ఉంటుంది. శరీరంలో ఎంజైములు, హార్మోన్ల విడుదల జీవ గడియారానికి అనుగుణంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిర్దిష్టం సమయంలో భోజనం చేస్తే... ఆహారం బాగా జీర్ణమై, శరీరానికి పోషకాలు బాగా అందుతాయని స్పష్టం చేస్తున్నారు. మధుమేహ బాధితులు తమ జీవ గడియారానికి అనుగుణంగా ఆహారం తీసుకుంటే... రక్తంలో షుగర్ స్థాయులు నియంత్రణలో ఉంటాయని, ఆయా సమయాల్లో ఇన్సులిన్, ఇతర హార్మోన్ల విడుదల తగిన స్థాయిలో ఉండటమే దీనికి కారణమని తేల్చి చెబుతున్నారు.