ఇటీవలి కాలంలో ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగింది. చాలా మందిలో ఈ సమస్య ఉన్నా... స్వల్ప లక్షణాలతో గుర్తించలేరు. సమస్య ముదిరే సరికి కాలేయం దెబ్బతినడం మొదలవుతుంది. అధిక కొవ్వులు ఉండే ఆహారం, జంక్ ఫుడ్, ఆల్కాహాల్ అలవాటు వంటివి ఫ్యాటీ లివర్ సమస్యకు దారితీస్తాయి. శరీరానికి వ్యాయామం లేకపోవడం కూడా ఈ సమస్యను పెంచుతుంది. ఈ క్రమంలోనే కొన్ని రకాల పండ్లు తరచూ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అవకాడోలు వీటిలో ఆరోగ్యకరమైన ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. దీనితోపాటు మన కాలేయం సమర్థవంతంగా పనిచేసేందుకు, శరీరంలో ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించేందుకు తోడ్పడే రసాయన సమ్మేళనాలు కూడా వీటిలో ఎక్కువ. ఇవి కాలేయ కణాలు దెబ్బతినకుండా కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు.బొప్పాయి వీటిలో అద్భుతమైన జీర్ణ సంబంధిత ఎంజైములు ఉంటాయని... అవి జీర్ణశక్తిని పెంచడంతోపాటు కాలేయాన్ని రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో విష పదార్థాలను తొలగించడంలో, పోషకాలను శరీరం బాగా సంగ్రహించడంలో బొప్పాయి బాగా పనిచేస్తుందని వివరిస్తున్నారు.దానిమ్మ దానిమ్మలో పాలిఫెనాల్స్ గా పిలిచే రసాయన సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయం దెబ్బతినకుండా కాపాడుతాయి. కాలేయం చుట్టూ కొవ్వు చేరకుండా అడ్డుకుంటాయి. మొత్తం శరీర ఆరోగ్యానికి కూడా బాగా తోడ్పడుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.నారింజ, నిమ్మ జాతి పండ్లు వీటిలో విటమిన్ సి ఎక్కువ. విటమిన్ సి శరీరంలో విష పదార్థాలను బయటికి పంపడంలో కాలేయానికి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తుందని, దీనివల్ల కాలేయం సమర్థవంతంగా పనిచేస్తుందని వివరిస్తున్నారు.పుచ్చకాయ వీటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. కాలేయం నుంచి విష పదార్థాలను బయటికి పంపించి, సమర్థవంతంగా పనిచేసేందుకు ఇవి తోడ్పడతాయి. శరీరంలో నీటి శాతం తగిన స్థాయిలో ఉండేలా చూస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.బెర్రీ జాతి పండ్లలో విభిన్నమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను, ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. ఇదే సమయంలో కాలేయం సమర్థవంతంగా విష పదార్థాలను వడగట్టేందుకు తోడ్పడతాయి.యాపిల్స్, మామిడి పండ్లు వీటిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. దాని చుట్టూ కొవ్వు చేరకుండా నియంత్రిస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్యను అరికడతాయని నిపుణులు వివరిస్తున్నారు.పండ్లు ఏవైనా సరే ఆరోగ్యకరమే అయినా షుగర్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని పేర్కొంటున్నారు.