కాలేయం మానవ శరీరంలో ముఖ్యమైన అవయవం. ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్స్ విడుదలతో పాటు అనేక పనులు నిర్వహిస్తుంది. కొందరికి చిన్నప్పటి నుంచి లివర్ సమస్యలు ఉంటాయి. కొందరికి మద్యపానం అలవాటుతో సమస్య మొదలవుతుంది. అంతేకాకుండా వయసు పెరిగే కొద్దీ కాలేయ పనితీరు నెమ్మదిస్తుంది. దీంతో.. అనేక వ్యాధుల బారిన మనం పడవచ్చు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ సమస్య కేసులు పెరుగుతున్నాయి. ఫ్యాటీ లివర్‌తో పాటు లివర్ సిర్రోసిస్, లివర్ ఇన్‌ఫెక్షన్, లివర్ ఫెయిల్యూర్ మొదలైన వాటి ప్రమాదం పెరుగుతుంది.
అయితే, చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ఫ్యాటీ లివర్.. దీన్ని హెపాటిక్ స్టీటోసిస్ అని కూడా పిలుస్తుంటారు. లివర్ కణాలలో కొవ్వు అతిగా చేరితే.. ఈ పరిస్థితి ఏర్పడుతుంది. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం, లివర్ కణాల్లో ఎంతో కొంత కొవ్వు ఉండటం మామూలే, కొంతవరకు ఉంటే ఇబ్బందేమీ ఉండదు గానీ మితిమీరితే లివర్‌కు ప్రమాదం. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు.. ఆహారంలో మార్పులు కచ్చితంగా చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. కొన్ని పండ్లు డైట్‌లో భాగం చేసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించుకోవచ్చు. పండ్లు పరిస్థితిని పూర్తిగా నయం చేయకపోవచ్చు. అయితే, ఈ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. ఆ పండ్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
బొప్పాయి
బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రధానంగా బొప్పాయి పండు జీర్ణవ్యవస్థకు చాలా మంచిదని భావిస్తారు. ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఈ పండులో ఉన్నాయి. బొప్పాయిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. దోరగా ఉన్న బొప్పాయి పండు తినడం వల్ల రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది. శరీరంలో విషపదార్థాల్ని తొలగించడంలో బొప్పాయి బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా బొప్పాయిలో ఉండే పోషకాలు కాలేయాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అవకాడో
అవకాడోను బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు. అవకాడోలో ఉండే పోషకాల కారణంగా.. దీనిని సూపర్ ఫుడ్ అని అంటారు. పోషకాలు పుష్కలంగా లభించే పండ్లలో అవకాడో ఒకటి. ఇందులో 25 రకాల పోషకాలు ఉన్నాయి. ఈ పండులో విటమిన్ ఎ, బి,సి,ఇ,కె, ఐరన్ , మెగ్నీషియం, కాపర్, పొటాషియం, ఫాస్పరస్ తో పాటు అనేక పోషకాలు ఉన్నాయి. ఈ పండులో మనిషికి అవసరమయ్యే కొవ్వు మాత్రమే ఉంటుంది. ఈ పండ్లను భోజనంతోపాటు తీసుకుంటే కడుపు నిండటంతోపాటు అనవసర కొవ్వులు పేరుకుపోకుండా నిలువరిస్తుంది. అంతేకాకుండా కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది.
దానిమ్మ
దానిమ్మలో పొటాషియం, కాల్షియం లాంటి మినరల్స్‌తో పాటు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ సి, కె, బి, ఎ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండును జ్యూస్‌గా కంటే నేరుగా గింజల రూపంలో తీసుకుంటేనే ఎక్కువ ప్రయోజనం. ఈ ఎర్రటి పండును రోజూవారి ఆహారంలో చేర్చుకుంటే చాలారకాల జబ్బుల నుంచి దూరంగా ఉండొచ్చు. ఈ పండులో పాలిఫెనాల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుండాయి. కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి.
బెర్రీస్
బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీ వంటి బెర్రీ జాతికి చెందిన పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా శరీరంలోని ఇన్ఫ్లమేషన్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తాయి. దీంతో మంట, వాపు వంటి సమస్యలు తగ్గుతాయి. దీంతో కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
యాపిల్
రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదంటారు. యాపిల్ మంచి పోషకాహారం. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్ సి, బి కాంప్లెక్స్, విటమిన్ ఇ, కె యాపిల్ తినడం వల్ల లభిస్తాయి. అంతేకాకుండా ఫైబర్, పొటాషియం, మెగ్నిషియం, బీటా కెరోటీన్ కూడా యాపిల్ తినడం వల్ల చేకూరతాయి. యాపిల్‌లో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. దీంతో.. కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. లివర్ చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది.
ఈ పండ్లు కూడా మేలు చేస్తాయి
* పుచ్చకాయ
* మామిడి
* సిట్రస్ జాతి పండ్లు
* ఈ పండ్లు శరీరం నుంచి టాక్సిన్స్‌ను బయటకు పంపుతాయి. దీంతో.. కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తాయి. అయితే, ఫ్యాటీ లివర్ సమస్య అధికంగా ఉంటే వైద్యుణ్ని సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం.