జపనీస్ కార్ల తయారీ దిగ్గజం హోండా భారత మార్కెట్లో తన కార్లకు కొత్త సొగసులు అద్దుతోంది. ఇప్పటికే తన సిటీ కారుకు అపెక్స్ వెర్షన్ ప్రకటించిన హోండా కార్స్ ఇండియా ఆ కారును ఇటీవలే ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్ పోలో ప్రదర్శించింది. అదే వరుసలో తన అమేజ్ మోడల్ కారుకు కూడా హోండా కొత్త వెర్షన్ ను తీసుకువస్తోంది. ఇది అమేజ్ కారుకు ఫేస్ లిఫ్ట్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్ టీరియర్స్, ఇంటీరియర్స్ ను ఆధునికీకరించారు. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 7 స్పీడ్ ఆటోమేటిక్ సీవీటీ ట్రాన్స్ మిషన్ తో వస్తోంది. ఇంజిన్ కెపాసిటీ 1,199 సీసీ కాగా... సాధారణ పరిస్థితుల్లో లీటర్ కు 19.46 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని హోండా ప్రకటించింది. అమేజ్ కారులోనూ హోండా తన ఐకానిక్ ఐ-వీటెక్ ఇంజిన్ ను అమర్చింది. సిటీ కారు తరహాలోనే ఇందులోనూ 7 రంగులతో రిథమిక్ యాంబియెంట్ లైటింగ్ థీమ్స్ ను చూడొచ్చు. హోండా సిటీ కారు ముందు భాగంలో ఉండే లేన్ వాచ్ కెమెరా... రోడ్డుపై ముందు వెళ్లే వాహనాలను గుర్తించి డ్రైవర్ ను అప్రమత్తం చేస్తుంది. ఇందుకోసం హోండా సెన్సింగ్ టెక్నాలజీ ఉపయోగించారు. అడాస్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్ సిస్టమ్ వంటి అడ్వాన్స్ డ్ ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయి. ఇన్ఫోటైన్ మెంట్ కోసం 8 అంగుళులా హెచ్ డీ డిస్ ప్లే పొందుపరిచారు. వైర్ లెస్ ఫోన్ చార్జర్, 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్, వైర్ లెస్ కనెక్టివిటీ కోసం ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 6 స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్స్ వంటి ఫీచర్లతో హోండా అమేజ్ ఆల్ న్యూ వెర్షన్ కారు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుంది.దీని ప్రారంభ ధర రూ.7,99,000 (ఎక్స్ షోరూమ్) అని కంపెనీ వెబ్ సైట్లో పేర్కొన్నారు. ఇందులో టాప్ వేరియంట్ జడ్ఎక్స్ మోడల్ ధర రూ.9.69 లక్షలు (ఎక్స్ షోరూమ్) అని హోండా కార్స్ ఇండియా వెల్లడించింది.