ఐరన్.. మన శరీరంలో ఎంతో ముఖ్యమైన ఖనిజం. ఐరన్ లోపం ఉంటే హెమోగ్లోబిన్ తగ్గడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మహిళల్లో ఎన్నో రకాల అనారోగ్యాలు తలెత్తుతాయి.అలసట, నీరసం.. వంటి సాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు.. నెలసరి సమయంలో బ్లీడింగ్‌లో హెచ్చుతగ్గులు, గర్భం ధరించలేకపోవడం, ఒకవేళ గర్భం వచ్చినా అది నిలవకపోవడం.. వంటి ప్రత్యుత్పత్తి సమస్యలూ తప్పవంటున్నారు నిపుణులు. ఐరన్ అనగానే పాలకూర, తోటకూర లాంటివి మాత్రమే చాలా మందికి గుర్తుకు వస్తాయి. కానీ కొన్ని ఇతర ఆకుపచ్చ కూరగాయల్లోనూ ఐరన్ ఎక్కువగా ఉంటుంది.ఐరన్‌ను పెంచే ఆహారాలలో ఆకు కూరలు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయి. వీటితోపాటు నిమ్మకాయను కూడా ఆహారంలో భాగంగా తినడం వల్ల ఐరన్ లోపాన్ని అరికట్టడంలో సహాయపడుతుంది. అలాగే టొమాటోలో లైకోపీన్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆకుపచ్చ కూరగాయలలో ఉండే పోషకాల మాదిరిగానే ఐరన్‌ను పెంచుతుంది. ఐరన్‌లోపంతో బాధపడేవారు ఆహారంలో పెరుగు కూడా చేర్చుకోవాలి. పెరుగు తీసుకోవడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి.
అల్లం, వెల్లుల్లి ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఐరన్ శోషణను మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితోపాటు చేప, మాంసం, లివర్, చికెన్‌లతోపాటు పప్పుధాన్యాలు, టోఫు, పాలకూర, బీన్స్, క్వినోవా, తృణధాన్యాలు, సిట్రస్ పండ్లు వంటి వాటిల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. 19 నుంచి 49 ఏళ్లలోపు ఆడవారికి రోజుకు 14.8 ఎంజీ ఐరన్ కావాలి. అది అందేలా చూసుకుంటే సమస్య నుంచి బయటపడొచ్చు. పై ఆహారాలు తీసుకుంటే ఐరన్ సమృద్ధిగా అందుతుంది.