ఇటీవలి కాలంలో ఈక్విటీల్లో పెట్టుబడులు భారీగా పెడుతున్నారు. స్టాక్ మార్కెట్లపై సరైన అవగాహన లేని వారంతా మ్యూచువల్ ఫండ్స్ వైపు మళ్లుతున్నారు. కోట్లాది రూపాయలు ఈక్విటీ ఫండ్స్‌లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు కొత్త కొత్త పథకాలను లాంచ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఇన్వెస్టర్లకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. తమకు అనువైన ఫండ్ ఎంచుకుని ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ క్రమంలోనే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మరో కొత్త స్కీమ్ తీసుకొస్తోంది. అందే ఎస్బీఐ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఫండ్. ఈ కొత్త ఫండ్ ఆఫర్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఎస్బీఐ న్యూ ఫండ్ ఆఫర్‌తో తమ మదుపరులను ఆకర్షిస్తోంది. దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందించాలనే లక్ష్యంగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఫండ్ పేరుతో కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ సబ్స్క్రిప్షన్ ఫిబ్రవరి 4వ తేదీతో ప్రారంభమవుతోంది. ఫిబ్రవరి 17, 2025 వరకు సబ్స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత యూనిట్ల కేటాయింపు ఉంటుంది. దాని తర్వాత క్రయ విక్రయాలకు రిటైల్ మార్కెట్లోకి ఈ ఫండ్ వస్తుంది.
ఈ కొత్త మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లోని నిధుల్లో 95 శాతం నుంచి 100 శాతం వరకు నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లోని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. మిగిలిన 0-5 శాతం నిధులను ప్రభుత్వ సెక్యూరిటీలైన ట్రేజరీ బిల్స్, ఎస్డీఎల్స్, ఇతర ఆర్బీఐ సూచించిన వాటిల్లో ఇన్వెస్టే చేస్తారు. అలాగే ఎస్బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త పథకం సబ్‌స్క్రైబ్ చేసేందుకు కనీస పెట్టుబడి రూ.5000గా ఉంది. ఆ తర్వాత రూ.5 వేల చొప్పున ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారానూ ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం కల్పిస్తారు. రోజువారీ, వారం, నెల, త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక పద్ధతుల్లో సిప్ ఇన్వెస్ట్ మెంట్ చేయొచ్చు.
ఎస్బీఐ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఫండ్ మేనేజర్లుగా హర్ష సేథి ఉన్నారు. ఆయన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్‌లో 2007 నుంచి పని చేస్తున్నారు. ఆయన ఇప్పటికే ఎస్బీఐ నిఫ్టీ ఐటీ ఈటీఎఫ్, ఎస్బీఐ నిఫ్టీ కన్సంప్షన్ ఈటీఎఫ్, ఎస్బీఐ నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఈటీఎఫ్, ఎస్బీఐ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్, ఎస్బీఐ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్, ఎస్బీఐ నిఫ్టీ ఇండియా కన్సంప్షన్ ఇండెక్స్ ఫండ్, ఎస్బీఐ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్ నిర్వహిస్తున్నారు.