ప్రస్తుతం చాలా మంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో కనిపించే వ్యర్థ పదార్థం. ఇది ప్యూరిన్ అనే రసాయన విచ్చిన్నం ద్వారా బాడీలో ఏర్పడుతుంది. సాధారణంగా మూత్రపిండాలు యూరిక్ యాసిడ్‌ను ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా శరీరం నుంచి తొలగిస్తాయి. అయితే, కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు.. కీళ్ల చుట్టూ చిన్న స్పటికాల రూపంలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు, నడవడంలో ఇబ్బంది వంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
అందుకే యూరిక్ యాసిడ్‌ని నియంత్రించడం చాలా ముఖ్యం. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే యూరిక్ యాసిడ్ స్థాయిల్ని తగ్గించుకోవాలి. యూరిక్ యాసిడ్ తగ్గించుకోవడం కోసం తినే ఆహారంపై దృష్టి పెట్టాలి. అందుకే ఆహారంలో కొన్ని పండ్లను భాగం చేసుకోవాలి. ఈ పండ్లను తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. వీటిని తినడం వల్ల మెటబాలిజం పెరిగి జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. ఇంతకీ ఆ పండ్లు ఏంటో ఓ లుక్కేద్దాం.
నారింజ
నారింజ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇది నిమ్మ, గ్రేప్ ఫ్రూట్, బత్తాయిలానే సిట్రస్ జాతికి చెందిన పండు. ఇందులో విటమిన్ సి, ఐరన్, మెగ్నిషియం, కాల్షియం, ఫైబర్, పొటాషియం, బి6 వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో అనేక వ్యాధుల నుంచి బయటపడతారు. ఇక, యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు తప్పనిసరిగా ఆరెంజ్‌ను ఆహారంలో చేర్చుకోవాలి. ఇది శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆరెంజ్ తినడం వల్ల శరీరంలోని జీవక్రియ వేగవంతం అవుతుంది. జీవక్రియ ప్రోటీన్లను వేగంగా జీర్ణం చేస్తుంది. దీంతో యూరిక్ యాసిడ్ తగ్గుతుంది.
అరటిపండు
అరటి పండులో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అలాగే అరటిలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. రోజు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అరటి పండు ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తుంది. అంతేకాకుండా వ్యాయామాలు, జిమ్ చేసేవారు అరటిపండును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతాయి. అరటిపండు అనేది పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6, ఫాస్పరస్ వంటి విటమిన్లు, ఖనిజాల గని. ఇక, అరటిపండులో పొటాషియం అధిక మోతాదులో ఉంటుంది. ఇది మూత్రం ద్వారా శరీరం నుంచి యూరిక్ యాసిడ్‌ను తొలగిస్తుంది. అంతేకాకుండా అరటి పండులోని తక్కువ మొత్తంలో ఉండే ప్రోటీన్ యూరిక్ యాసిడ్ స్థాయిల్ని సాధారణంగా ఉంచుతుంది.
యాపిల్
రోజుకు ఒక్క యాపిల్ అయినా సరే తినాలంటారు. ఒక్క యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదంటారు. యాపిల్ పండులో విటమిన్లు, ఫైబర్, ఐరన్, పొటాషియం, మెగ్నిషియం, కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాల్ని అందిస్తాయి. రోజూ ఒక యాపిల్ తింటే చాలా రోగాలను దూరం చేసుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా యాపిల్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిల్ని తగ్గించుకోవచ్చు. ఇందులో మాలిక్ యాసిడ్ ఉంటుంది. ఈ యాసిడ్ యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తుంది. అందుకే యాపిల్‌ను కచ్చితంగా తినాలంటారు.
పచ్చి బొప్పాయి
బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రధానంగా బొప్పాయి పండు జీర్ణవ్యవస్థకు చాలా మంచిదని భావిస్తారు. ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఈ పండులో ఉన్నాయి. ఇక, పచ్చి బొప్పాయిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి లక్షణాలు ఉన్నాయి. బొప్పాయిలో ఉండే ఫైబర్ యూరిక్ యాసిడ్ రోగులకు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ మొత్తాన్ని నియంత్రించడానికి, బొప్పాయి వివిధ మార్గాల్లో ఆహారంలో భాగం చేసుకోవచ్చు. పచ్చి బొప్పాయిని జ్యూస్ లేదా డికాక్షన్ రూపంలో తీసుకోవచ్చు.
అవకాడో
అవకాడోని వెన్న పండు అంటారు. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, ప్రోటీన్స్, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి6 ఉన్నాయి. ఇక, ఇందులో ఉండే పొటాషియం మూత్రం ద్వారా శరీరం నుంచి యూరిక్ యాసిడ్‌ను తొలగిస్తుంది. అంతేకాకుండా అవకాడోలో తక్కువ మొత్తంలో ఉండే ప్రోటీన్ యూరిక్ యాసిడ్ స్థాయిల్ని సాధారణంగా ఉంచుతుంది. రెగ్యులర్‌గా అవకాడో తినడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది.