గుంటూరు నగర పాలక సంస్థ, పురపాలక సంఘాల్లో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇల్లు, స్థలాలు కోల్పోయిన వారికి జారీచేసిన ‘టీడీఆర్ బాండ్స్’ వ్యవహారంలో భారీ అవినీతి, అక్రమాలు జరిగినట్టు తెలిసింది. ఈ విషయాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ నిర్ధారించింది. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో కొందరు టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టినట్లు గుర్తించారు. రోడ్డు అభివృద్థి ప్రణాళిక(ఆర్‌డీపీ) లేకుండానే టీడీఆర్ బాండ్లు జారీ చేసినట్లు విచారణలో తేలింది. గుంటూరు, మంగళగిరి కార్పొరేషన్‌లతో పాటు, 10 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 750 టీడీఆర్ బాండ్లు జారీఅయ్యాయి. మార్కెట్ విలువ తక్కువగా ఉన్న చోట ఎక్కువగా ఉన్నట్లు చూపించి ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా అధికారులు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని, ఈ క్రమంలో డోర్ నెంబర్లు సైతం మార్చేశారని విచారణాధికారులు గుర్తించారు.
ఒక్క గుంటూరు ప్రాంతంలోనే రూ.5.85 కోట్ల వరకు ఖజానాకు నష్టం జరిగిందని గుర్తించారు. గుంటూరు, మంగళగిరి, చిలకలూరిపేట, చీరాలలో చాలా చోట్ల రోడ్డు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించకుండానే ఇష్టం వచ్చినట్లు టీడీఆర్ బాండ్లు ఇచ్చేశారు. దీంతో రూ.10కోట్ల వరకు ఖజానాకు నష్టం వాటిల్లిందని తేలింది. 10 మంది టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ వ్యవహారంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. వారికి విజిలెన్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.