టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు బ్యాట్ ఝుళిపించాడు. ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో తనదైన శైలిలో రెచ్చిపోయిన ఈ ప్లేయర్.. 76 బంతుల్లోనే మూడంకెల మార్కును అందుకున్నాడు. మొత్తంగా 90 బంతుల్లో 119 రన్స్ చేశాడు. ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముంగిట రోహిత్ ఫామ్‌లోకి రావడం పట్ల ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ హిట్‌మ్యాన్ ఇదే జోరు కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ.. తన భార్య రితికా సజ్డేకుకు ఫోన్ చేసి మాట్లాడాడు. ఇక సుదీర్ఘ విరామం తర్వాత సెంచరీ చేసిన రోహిత్ శర్మను ఉద్దేశించి రితికా కూడా సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. కాగా రోహిత్ శర్మ ఆడే మ్యాచ్ చూసేందుకు రితికా స్టేడియానికి వచ్చేది. కానీ ఇటీవల రెండో బిడ్డకు జన్మనివ్వడంతో ఆమె మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి రావడం లేదు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సెంచరీ తర్వాత.. సోషల్ మీడియాలో ఆమె పోస్టు పెట్టింది. “ఈ సెంచరీ నిజంగా హృదయాన్ని తాకింది” అనే అర్థం వచ్చేలా ఆమె పోస్టు పెట్టింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం పట్ల భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ సంతోషం వ్యక్తం చేశాడు. హిట్‌మ్యాన్ ఇదే జోరు కొనసాగిస్తే భారత్.. కచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. “ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ ఇదే దూకుడు ప్రదర్శిస్తే భారత్ ఛాంపియన్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు” అని పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్‌కు ముందు వరకు రోహిత్ రిటైర్మెంట్ చేయాలని డిమాండ్లు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కూడా అజహరుద్దీన్ స్పందించాడు. “రిటైర్మెంట్ గురించి మాట్లాడే హక్కు ఎవరికీ ఉండదు. కొన్నిసార్లు ఈ తరహా కామెంట్లు బాధ కలిగిస్తాయి. రోహిత్ బాగా ఆడి.. తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. అతడు దానినే కంటిన్యూ చేస్తాడనుకుంటున్నా” అని చెప్పాడు.
కాగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్, దుబాయ్ వేదికగా జరగనుంది. 8 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో ఫైనల్‌తో కలిపి 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నీ లీగ్ దశలో భారత్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న పాకిస్థాన్, మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడనుంది.