ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో కివీస్ స్టార్ ప్లేయర్ సెంచరీ చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టచ్‌లోకి వచ్చి.. ఆ జట్టు అభిమానులను కుషీ చేశాడు. ఈ మ్యాచ్‌తో కలిపి ట్రై సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లలో గెలిచిన న్యూజిలాండ్.. ఫైనల్ చేరింది.
లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 రన్స్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో అరంగేట్ర ప్లేయర్ మాథ్యూ బ్రీట్జ్‌కే రికార్డు సెంచరీ సాధించాడు. 26 ఏళ్ల ఇతడు.. 148 బంతుల్లో 150 పరుగులు చేశాడు. దీంతో వన్డే క్రికెట్ అరంగేట్రంలో అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్‌కు చెందిన డెస్మండ్ హేన్స్ పేరిట ఉంది. అతడు 1978లో ఆస్ట్రేలియాపై 148 పరుగులు చేశాడు. కాగా సుమారు ఐదేళ్ల తర్వాత కేన్ విలియమ్సన్ వన్డేల్లో సెంచరీ చేయడం గమనార్హం.
మాథ్యూ బ్రీట్జ్‌కే షో తర్వాత.. కేన్ మామ విధ్వంసం మొదలైంది. ఓపెనర్ విల్ యంగ్ ఔట్ అయ్యాక క్రీజులో వచ్చిన విలియమ్సన్.. ఎడాపెడా ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే 72 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీతో పలు రికార్డులను బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 113 బంతుల్లో 133 రన్స్ చేసి విలియమ్సన్.. న్యూజిలాండ్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, సౌరవ్ గంగూలీని అధిగమించాడు. కేన్ 159 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ సాధించగా.. కోహ్లీ (161), డివిలియర్స్ (166), గంగూలీ (174) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. హషీమ్ ఆమ్లా (150 ఇన్నింగ్స్‌లలో) అగ్రస్థానంలో ఉన్నాడు.
విలియమ్సన్‌తో పాటు డేవాన్ కాన్వే (97) కూడా రాణించడంతో న్యూజిలాండ్ 48.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ముక్కోణపు సిరీస్‌లో కివీస్ ఫైనల్ చేరింది. ఈనెల 12న దక్షిణాఫ్రికాతో పాకిస్థాన్ తలపడనుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫిబ్రవరి 14న కివీస్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
![]() |
![]() |