టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చివరికి అతని ప్రాక్టీస్ సెషన్స్ కు కూడా భారీ సంఖ్యలో అభిమానులు రావడం కటక్ లో జరిగిన రెండో వన్డేకు ముందు కనిపించింది. ఇక రన్ మెషీన్ బ్యాట్ పట్టి మైదానంలో అడుగుపెడితే మోత మోగిపోవాల్సిందే. ఇటీవల ఫామ్‌లేక వరుసగా విఫలం అవుతున్న కోహ్లీకి అభిమానుల ఆదరణ మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కటక్ లో రెండో వన్డే ముగిసిన తర్వాత మూడో మ్యాచ్ కోసం జట్టు అహ్మదాబాద్ వెళ్లేందుకు భువనేశ్వర్ విమానాశ్రయానికి చేరుకుంది. ఇక ఎయిర్‌పోర్టులో చెకింగ్ ఏరియాకు ముందు తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు కొంతమంది ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. ఇంతలోనే అటువైపుగా వచ్చిన కోహ్లీ.. ఆ గుంపులో నిలబడ్డ ఓ మహిళను చూసి నవ్వుతూ ఆమె వద్దకు వెళ్లాడు. మహిళ దగ్గరికి వెళ్లి హగ్ ఇచ్చి మాట్లాడాడు. దాంతో అక్కడే ఉన్న మిగిలిన అభిమానులు కోహ్లీకి షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో భద్రతా సిబ్బంది కలగజేసుకుని విరాట్‌ను అక్కడి నుంచి పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో కోహ్లీ హగ్ ఇచ్చిన ఆ లక్కీ లేడీ ఎవరంటూ నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. అయితే, ఆమె కోహ్లీకి దగ్గరి బంధువు అని సమాచారం. అందుకే ఆమె వద్దకు వెళ్లి హగ్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇక భారత్, ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్ విషయానికి వస్తే... ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగిశాయి. ఈ రెండింటీలోనూ ఆతిథ్య భారతే విజేతగా నిలిచింది. దీంతో టీమిండియా 2-0తో సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. దాంతో రేపు (బుధవారం) అహ్మదాబాద్ వేదికగా జరిగే మూడో వన్డే నామమాత్రంగా మారింది.
![]() |
![]() |