మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మహాక్షేత్ర సందర్శనకు అటవీ మార్గంలో కాలి నడకన వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని నంద్యాల జిల్లా కలెక్టర్ జీ రాజకుమారి చెప్పారు. మంగళవారం శ్రీశైలంలోని కైలాస ద్వారం నుండి.. అటవీ మార్గంలోని తుమ్మల బైలు, పెచ్చేరువు, నాగులూటి గూడెం, వెంకటాపురం వరకు ప్రయాణిస్తూ ఏఏ ప్రదేశాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంశాలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ సీ విష్ణుచరణ్, శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు, డీఎఫ్ఓ అబ్దుల్ రవూఫ్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.తుమ్మలబైలు నుండి పెచ్చేరువుకు వెళ్ళే అటవీ మార్గంలో పెద్ద పులి పాద ముద్రలను కలెక్టర్ జీ రాజకుమారి పరిశీలించారు. సంబంధిత వివరాలను అటవీ సిబ్బంది నుండి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జీ రాజకుమారి మాట్లాడుతూ వెంకటాపురం నుండి కైలాస ద్వారం వరకు 46 కిమీ మార్గంలో భక్తులు కాలినడకన ప్రయాణించాలని ఈ మేరకు గుర్తించిన 12 ప్రదేశాల్లో భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు, షేడ్, భోజన వసతి, వైద్య సదుపాయం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
![]() |
![]() |