ప్రతి ఇంట్లో కూడా టమాటా లేనిదే చాలా మంది కూరలు వండరు. చాలా కూరల్లో టమాటనే స్టార్ ఐటమ్. టమాట పప్పు, టమాట కూర, వంకాయ టమాట, టమాట చట్నీ, టమాట చారు ఇలా రకరకాల వంటల్లో ఉపయోగిస్తున్నారు. ఇక, టమాటలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. టమాటలో బీటా కెరోటిన్, ఫ్లేవనాయిడ్లు, లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. టమాటలో విటమిన్ సి ఉంది. ఈ పోషకాలతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కంటి చూపు మెరగవుతుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ లెవల్స్ తగ్గుతాయి. టమాటాలు తినడం వల్ల రక్తపోటు అందుపులో ఉంటుంది. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ఇలాంటి టమాటను మాత్రం కొందరు తినకూడదు. టమాటాలు ఎవరు తినకూడదో ఆయుర్వేద వైద్యుడు మిహిర్ ఖాత్రి వివరించారు. వారెవరో ఇక్కడ తెలుసుకుందాం.
అలెర్జీ సమస్యలు
చర్మంపై తరచుగా అలెర్జీలు లేదా ఎర్రటి మచ్చలు, మంట, శ్వాసకోస తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చేవారు టమాటాల్ని తినకూడదు. వీరికి టమాటాలు హానికరంగా మారవచ్చు. వేడి, కారంగా ఉండే వంటకాలు, పుల్లని పండ్లు, టమోటాలు, బంగాళాదుంపలు, వంకాయలు మొదలైనవి శరీరంలో పిత్త దోషాన్ని పెంచుతాయని ఆయుర్వేద డాక్టర్ తెలిపారు. పిత్త దోషం వల్ల చర్మ అలెర్జీ సమస్యలు వస్తాయి.
పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం ఉన్నవారు
పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం ఉన్నవారు టమాటాలు, టమాటా సాస్, టమాటా సూప్ మొదలైనవి తినకూడదు. ఎందుకంటే ఇది సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. టమాటాలు తినడం వల్ల శరీరంలో పైత్య రుగ్మత పెరుగుతుంది. దీని వలన అధిక స్రావం జరుగుతుంది.
అల్సర్ సమస్య
టమాటాలు తినడం వల్ల కడుపులోని ఆమ్లత్వం పెరుగుతుంది. ఎందుకంటే టమాటాలు జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తాయి. దీంతో పుల్లటి తేన్పులు, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. అల్సర్ సమస్య లేదా గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు టమాటాలు తినకపోవడమే మేలు అంటున్నారు ఆయుర్వేద డాక్టర్. ఒకవేళ తినాలనుకుంటే పసుపు, మిర్చి, జీలకర్రతో కలిపి ఉడికించి తింటే మేలు అంటున్నారు.
కిడ్నీలో రాళ్లు
కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధపడేవారు టమాటలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. టమాటాల్లో కాల్షియం ఆక్సలేట్ ఉంటుంది. టమాట విత్తనాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి. అందుకే ఇలాంటి వారు టమాటాలకు దూరంగా ఉండటమే ఉత్తమం.
గౌట్ సమస్య, ఆర్థరైటిస్
టమాటా కడుపులో గ్యాస్‌ను సృష్టిస్తుంది. కాబట్టి ఇప్పటికే గ్యాస్ సమస్యలు ఉంటే దానిని తినకండి. అంతేకాకుండా కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, గౌట్ సమస్యతో బాధపడేవారు టమాటాలకు దూరంగా ఉండాలి. ఈ సమస్యలు ఉన్నవారికి పచ్చి టమోటాలు మరింత హాని కలిగిస్తాయి. అందుకే ఇలాంటి వారి టమాటాల్ని తినకపోవడమే మంచిదంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
![]() |
![]() |