విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. నిర్మాణ పనుల్లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి చనిపోయాడు. భోగాపురం విమానాశ్రయం లోపల రహదారుల నిర్మాణం చేపడుతున్నారు. అయితే రోడ్ల నిర్మాణానికి బండరాళ్లు అడ్డుగా రావటంతో వాటిని తొలగించే పనులు చేపట్టారు. అందులో భాగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం లోపలి ప్రాంతంలో బండరాళ్లను బాంబులు పెట్టి పేల్చేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సమయంలో ఒక్కసారిగా బ్లాస్టింగ్ జరగటంతో రామచంద్రపేటకు చెందిన బోర కొత్తయ్య అనే వ్యక్తి చనిపోయాడు. ఘటనలో బోర కొత్తయ్యకు తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2026 జూన్ నాటికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానం చేస్తూ 15 రహదారుల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదించారు. ఈ విషయాన్ని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. వీఎంఆర్డీఏ పరిధిలోని అన్ని నియోకజవర్గాల్లోనూ అభివృద్ది పనులు చేపడుతున్నట్లు వివరించారు. ప్రతిపాదించిన 15 రహదారుల్లో ఇప్పటికే మారికవలస రహదారి నిర్మాణం పూర్తైందని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ వెల్లడించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి మిగతా వాటిని పూర్తిచేస్తామన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2200 ఎకరాలలో నిర్మిస్తున్నారు. మూడు దశల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు చేపడుతున్నారు. మొదటి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రెండో దశలో ఈ సంఖ్యను రెట్టింపు చేయనున్నారు. ఇక మూడో దశలో మరో 60 లక్షల మంది ప్రయాణికులు అంటే.. ఏడాదికి కోటీ 80 లక్షల మంది రాకపోకలు సాగించేలా ఎయిర్‌పోర్టు సామర్థ్యాన్ని పెంచనున్నారు. రూ.4592 కోట్లతో మొదటి విడత పనులు చేస్తున్నారు. 2023 మే నెలలో ఈ పనులకు శంకుస్థాపన జరగ్గా.. వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసేలా కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
![]() |
![]() |