తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పారు. క్యాన్సర్, లంగ్ ఇన్‌ఫెక్షన్‌తో చికిత్స కోసమే అమెరికాకు వెళ్లినట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను నిందితుడిగా చేర్చడానికి ముందే తాను యూఎస్ వెళ్లినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా తనపై నిందితుడు అని ముద్ర వేయటం సరైంది కాదన్నారు. తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ లేదని.. కేసుకు సంబంధించిన అన్ని వివరాలు తాను పోలీసులకు మెయిల్ చేస్తున్నట్లు చెప్పారు.
కాగా,గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు, కీలక వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం మారగానే..అందుకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారంటూ పలువురు పోలీసు ఉన్నాతాధికారులను అరెస్టు చేశారు. గతేదాడి మార్చి 10వ ఈ కేసులో ప్రభాకర్ రావుపై కేసు నమోదైంది. ప్రధాన నిందితుడిగా ప్రభాకర్ రావు పేరును చేరుస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. మరో కీలక నిందితుడిగా ఓ టీవీ ఛానెల్ ఎండీ శ్రవణ్ కుమార్ పేరును చేర్చగా.. అతడు కూడా దేశం విడిచి వెళ్లాడు. దీంతో వీరిద్దరిని భారత్ రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇటీవల ప్రధాన నిందితుడుగా ప్రభాకరరావు, మరో ముఖ్య నిందితుడు శ్రవణ్‌రావులపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ పోలీస్ (ఇంటర్ పోల్) నుంచి సీబీఐ ద్వారా తెలంగాణ సీఐడీకి సమాచారం అందింది. వారిద్దరినీ వీలైనంత త్వరగా ఇండియాకు తీసుకొచ్చే విషయంపై కేంద్ర హోం, విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అరెస్ట్ తప్పదని భావించిన ప్రభాకర్ రావు తాజాగా.. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
![]() |
![]() |