లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరింపులకు గురిచేసి రూ.2.20 కోట్లు వసూలు చేశారంటూ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజనిపై సీఐడీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విడదల రజని మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. నరసరావుపేట టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఈ కుట్రకు కారణమని అన్నారు. ఆయన చేస్తున్న వ్యాపార లావాదేవీలకు సహకరించాలని గతంలో తనపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని... దానికి తాను అంగీకరించకపోవడంతో తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు. తనపై అక్రమ కేసులు పెట్టించి, రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని రజని అన్నారు. తన కుటుంబాన్ని, జర్మనీలో ఉన్న తన మరిదిని కూడా వివాదంలోకి లాగుతున్నారని మండిపడ్డారు. అంతా తాను చూసుకుంటానని చెప్పి, ఆ తర్వాత తప్పుడు కేసులు పెట్టించారని దుయ్యబట్టారు. కృష్ణదేవరాయలు గతం నుంచే తనపై ద్వేషంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. 2020లో వైఎస్ వర్ధంతి సందర్భంగా గురజాల పీఎస్ లో ఆయన అధికారాన్ని తమపై చూపించారని రజని చెప్పారు. తన ఫోన్ డేటాను తీసే ప్రయత్నం కూడా చేశారని... ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కాల్ డేటాను తీసే అధికారం ఎంపీకి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తనపై కేసు నమోదు చేయడం రాజకీయ కుట్రలో భాగమని చెప్పారు.
![]() |
![]() |