హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టపగలే ఓ లాయర్‌ను ఎలక్ట్రీషియన్ అత్యంత కిరాతకంగా పొడిచి చంపేశాడు. ఒక లాయర్‌ను ఓ ఎలక్ట్రీషియన్ అంత కసితో కత్తితో పొడిచి చంపాడంటే.. ఏ ఆస్తి తగాదాలోనో, ఫ్యామిలీకి సంబంధించిన వివాదంలోనో తనకు వ్యతిరేకంగా వాదిస్తున్నాడన్న కోపం అయ్యుంటుందని అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఆ నిందుతుడు లాయర్‌ను చంపేయడానికి కారణం.. ఒక మహిళ కావటం గమనార్హం. ఒక ఎలక్ట్రీషియన్ ఏకంగా ఓ లాయర్‌ను హత్య చేసేందుకు కారణమైన ఆ మహిళ ఎవరు.. అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందని తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
చంపాపేట డివిజన్ ఐఎస్ సదన్‌లోని అంబేద్కర్‌వాడలో ఇజ్రాయెల్ అనే న్యాయవాది ఉంటారు. అయితే.. ఇజ్రాయెల్ ఇంట్లో ఓ మహిళ అద్దెకుంటోంది. ఆ మహిళపై.. దస్తగిరి అనే ఎలక్ట్రీషియన్ కన్నేశాడు. రకరకాల మార్గాల్లో ఆమెను దస్తగిరి వేధిస్తున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెప్పినా, బయట తెలిసినా తనకు ఇబ్బంది అవుతుందని భావించిన ఆ మహిళ.. చాలా రోజుల పాటు ఓపికపట్టింది. కానీ.. దస్తగిరి నుంచి వేధింపులు వస్తూనే ఉన్నాయి. ఇక ఓపికపట్టి లాభం లేదని భావించిన మహిళ.. తమ ఇంటి ఓనర్ లాయరే కదా.. ఆయనతో ఈ విషయం పంచుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావించింది. ఇజ్రాయెట్ ఫ్రీగా ఉన్న సమయంలో వెళ్లి.. తాను ఎదుర్కుంటున్న ఇబ్బందిని ఆయనతో వివరించింది.
ఆ మహిళ పడుతున్న బాధ విన్న లాయర్ ఇజ్రాయెల్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. పోలీసులు దస్తగిరిని తమదైన శైలిలో మందలించారు. ఇక అప్పటి నుంచి లాయర్ ఇజ్రాయెల్ మీద దస్తగిరి కక్ష పెంచుకున్నాడు. సమయం చూసి లాయర్‌ను ఏసెయ్యాలని భావించాడు. తనపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా.. అంటూ ఆదివారం (మార్చి 23న) ఉదయం అందరూ చూస్తుండగానే ఇజ్రాయెల్ మీద కత్తితో దాడి చేశాడు దస్తగిరి. ఈ దాడిలో తీవ్రంగా లాయర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు స్పందించి లాయర్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాగా.. చికిత్స పొందుతూ ఇజ్రాయెల్ ప్రాణాలు వదిలారు.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహిళ విషయంలో లాయర్ ఇజ్రాయెల్ ఫిర్యాదు చేయటం వల్లే దస్తగిరి ఇంత దారుణానికి పాల్పడినట్టుగా స్థానికులు చెప్తున్నారు. కాగా.. నిందితుడు దస్తగిరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. అయితే.. పట్టపగలే అందరూ చూస్తుండగా హత్య జరగటంతో.. స్థానికులు హడలెత్తిపోతున్నారు.
![]() |
![]() |