విశాఖ జిల్లా భీమిలి పరిధిలో సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా సముద్రానికి అతి సమీపంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను అధికారులు అడ్డ్డుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పెనక నేహారెడ్డి కంపెనీ అవ్యాన్ రియల్టర్స్ ఎల్‌ఎల్‌పీ అడ్డగోలుగా కాంక్రీట్ గోడ నిర్మిస్తున్నా కళ్లు మూసుకున్న అప్పటి జీవీఎంసీ, రెవెన్యూ అధికారుల పేర్లను తమ ముందు ఉంచాలని పిటిషనర్లను ఆదేశించింది. వారిపై చర్యలకు ఆదేశిస్తామని పేర్కొంది. కాంక్రీట్ గోడ నిర్మాణం జరిగిన తీరుపై విస్మయం వ్యక్తం చేసింది. అక్రమ కాంక్రీట్ నిర్మాణాలతో ప్రకృతికి జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు సాధ్యమైనంత త్వరగా నిపుణులతో కూడిన కమిటీని అక్కడికి పంపించాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. జాప్యం చేస్తే జరిగిన నష్టాన్ని అంచనా వేయడం కష్టమవుతుందని వ్యాఖ్యానించింది. తీర ప్రాంతంలో నిర్మించిన రెస్టోబార్ల విషయంలో సర్వే జరిపి అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను జూన్ 18కి వాయిదా వేసింది. బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. కాంక్రీట్ గోడ కూల్చివేత పనులు కొనసాగించాలని అధికారులకు స్పష్టం చేసింది. భీమునిపట్నం పరిధిలోని సీఆర్‌జెడ్-1 ప్రాంతంలో సముద్రానికి అతిసమీపంలో అవ్యాన్ రియల్టర్స్ ఎల్‌ఎల్‌పీ శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ జనసేన కార్పొరేటర్ పీఎల్‌వీఎన్ మూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అలాగే సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నాలుగు రెస్టోబార్లను తొలగించడంతో పాటు సహజ ఆవాసాలను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ గ్రామాభివృద్ధి సేవా సంఘం అధ్యక్షుడు గంటా నూకరాజు పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం నేహారెడ్డి కంపెనీపై క్రిమినల్ చర్యలు ప్రారంభించేందుకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఏపీసీజెడ్‌ఎంఏ) మెంబర్ సెక్రటరీని ఆదేశించింది. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చింది.
![]() |
![]() |