రాయల్ ఎన్ ఫీల్డ్ రాజసం, దర్పం, ఠీవి ఇలా ఏ పదం ఉపయోగించినా సరిగ్గా సరిపోయే బైకులతో భారత మార్కెట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అప్పట్లో రాయల్ ఎన్ ఫీల్డ్ అంటే బుల్లెట్ బైక్ గుర్తొచ్చేది. థఢ్ థడ్ థడ్ అంటూ శబ్దం చేసుకుంటూ రాయల్ ఎన్ ఫీల్డ్ బండి వెళుతుంటే ఓ లుక్కు వేయకుండా ఉండలేం.అయితే ఓ దశలో రాయల్ ఎన్ ఫీల్డ్ మార్కెట్ లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. అలాంటి సమయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను మళ్లీ నిలబెట్టిన బైక్ లు క్లాసిక్ 350, క్లాసిక్ 500. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ మోడల్స్ రూపం చాలా మందిని ఆకట్టుకునేలా ఉంటుంది. క్లాసిక్ 350 బైక్ అమ్మకాల్లో ముందున్నా, క్లాసిక్ 500ను నిలిపివేయడం అభిమానులకు బాధ కలిగించింది. ఈ నేపథ్యంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒక పెద్ద క్లాసిక్ మోడల్‌ను విడుదల చేస్తుందని అందరూ ఎదురు చూశారు. ఇప్పుడు అందరి అంచనాలను నిజం చేస్తూ క్లాసిక్ 650 వచ్చేసింది.రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ బైక్ డిజైన్ అభిమానులకు చాలా ఇష్టం. అందుకే రాయల్ ఎన్‌ఫీల్డ్ తన క్లాసిక్ 650 డిజైన్ లో పెద్దగా మార్పులు చేయలేదు. క్లాసిక్ 350 రూపుతోనే క్లాసిక్ 650ని తీసుకువచ్చింది. దీనిలో ఎల్ఈడీ హెడ్‌లైట్ ఉంది. ముందువైపు మడ్‌గార్డ్ క్రోమ్ పూతతో రెట్రో లుక్ ను ఇస్తోంది. మొత్తంగా బైక్ క్లాసిక్ లుక్‌లో ఉంది. క్లాసిక్ 650 బైక్‌లో ఎంఆర్‌ఎఫ్ నైలాగ్రిప్ టైర్లు అమర్చారు. 19 అంగుళాల ఫ్రంట్ టైర్ ఉంది. క్లాసిక్ 350తో పోల్చితే క్లాసిక్ 650 బైక్ సైజు పెద్దదిగా ఉంది. దీని వీల్‌బేస్ 1,475 మిమీ, ఇది సూపర్ మెటియోర్ 650 కంటే కొంచెం తక్కువ. ట్యాంక్‌పై క్రోమ్ పూత, బంగారు రంగు గీతలు బైక్‌కు ఒక విలాసవంతమైన రూపాన్ని ఇస్తున్నాయి. పెట్రోల్ నింపే మూత కూడా క్రోమ్ ఫినిష్ తో ఉంది.ఈ బైక్‌లో 14.7 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉంది. సింగిల్ సీటు ఆప్షన్ కూడా ఉంది. ఈ బైక్ రెండు సీట్ల మోడల్ లో వస్తుంది. వెనుక సీటును సులభంగా తొలగించవచ్చు. సీటు సౌకర్యవంతంగా, విశాలంగా ఉంది. వెనుక మడ్‌గార్డ్‌కు కూడా క్రోమ్ ఫినిష్ ఉంది. డ్యూయల్ ఎగ్జాస్ట్ పైపులకు కూడా క్రోమ్ ఫినిష్ ఉంది. స్విచ్‌లు, ట్రిపుల్ క్లాంప్ కూడా క్రోమ్ ఫినిష్ తో ఉన్నాయి. చాలా భాగాలు క్రోమ్ టచ్ తో ఉండటం వల్ల బైక్ లుక్ మరింత రాయల్ గా ఉంటుంది.ఇందులోనూ క్లాసిక్ 350లో ఉన్న డాష్‌బోర్డ్‌ను ఇందులో ఉపయోగించారు. స్పీడోమీటర్, ఇండికేటర్ లైట్లు, డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఉన్నాయి. ఓడో, ట్రిప్ మీటర్ రీడింగ్‌లను డిజిటల్ స్క్రీన్‌పై చూడవచ్చు. క్లాసిక్ 650 క్లాసిక్ 350 మోడల్‌ను పోలి ఉండటం వల్ల, సీటింగ్ పొజిషన్ చాలా సౌకర్యవంతంగా ఉంది. దీని సీటు ఎత్తు 800 మిమీ (గ్రౌండ్ క్లియరెన్స్) కాబట్టి, తక్కువ ఎత్తు ఉన్నవారు కూడా సులభంగా నడపగలరు. హ్యాండిల్‌బార్ వెడల్పుగా ఉండటం వల్ల నడపడానికి సులభంగా ఉంది. ఫుట్ పెగ్స్ భాగం సరైన ఎత్తులో ఉండటం వల్ల సిట్టింగ్ పొజిషన్ సౌకర్యవంతంగా ఉంటుంది. ఎక్కువ దూరం నడపడం సులభం. క్లాసిక్ 650 బైక్ బరువు 243 కిలోలు. క్లాసిక్ 650 సూపర్ మెటియోర్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించబడింది. ముందువైపు 43 మిమీ టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి, వెనుకవైపు డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. ఇందులో 650సిసి ట్విన్ ఇంజిన్ అమర్చారు, ఇది 47bhp@7,250rpm శక్తిని, 52.3Nm టార్క్ @ 5,650rpmను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు. క్లాసిక్ 650 బైక్‌లో 320 మిమీ ముందు డిస్క్ మరియు 300 మిమీ వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. బ్రేక్‌లు బైబ్రే సంస్థచే తయారు చేయబడ్డాయి, అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ ముద్రతో ఉన్నాయి.రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 బైక్‌ను నడుపుతున్నప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీని బరువు 243 కిలోలు అయినప్పటికీ, రైడింగ్ చేసేటప్పుడు ఆ బరువు తెలియదు. స్టార్ట్ చేసిన వెంటనే ఇంజిన్ శబ్దం వినడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. క్లచ్ తేలికగా ఉండడంతో స్మూత్ గా గేర్లు మార్చుకోవచ్చు. ముఖ్యంగా, ఎటువంటి వైబ్రేషన్లు లేవని రైడర్లు చెబుతున్నారు. క్లాసిక్ 650 ఒకే వేరియంట్‌లో లభిస్తుంది. రంగుల్లో మాత్రమే తేడా ఉంది. క్లాసిక్ క్రోమ్ ఎడిషన్ ధర రూ. 3.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇతర రంగుల ధర రూ. 3.37 లక్షల నుంచి ప్రారంభమవుతుంది
![]() |
![]() |