ఆంధ్రప్రదేశ్‌లో ఓ పెద్ద పాము సంచారం కలకలం రేపింది. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలోని పంట పొలాల్లో 15 అడుగుల భారీ గిరినాగు ప్రత్యక్షమైంది. పొలాల్లో పాము కనిపించడంతో అక్కడే ఉన్న కుక్కలు గట్టిగా అరుస్తూ పామును వెంబడించాయి. రైతులకు ఏం జరుగుతుందో అర్థంకాలేదు.. అసలు కుక్కలు అంతగా ఎందుకు అరుస్తున్నాయా అనుకుంటూ అటు వైపువెళ్లి చూశారు. అక్కడ 15 అడుగుల భారీ గిరినాగు కనిపించింది. రైతులు, స్థానికులు గిరినాగును తరిమే ప్రయత్నం చేయగా.. అది మనుషుల్ని చూడగానే ఒక్కసారిగా వారి మీదకు కోపంతో కాటు వేస్తున్నట్లు ఎగిరి దాడికి ప్రయత్నించింది.
కింగ్ కోబ్రా దెబ్బకు రైతులు భయంతో కేకలు వేస్తూ దూరంగా పరుగులు తీశారు. ఆ వెంటనే ఆ పాము చెట్ల మధ్యలో నుంచి వెళ్లిపోయింది. అయినా సరే రైతులు ఆందోళనలో ఉన్నారు.. మళ్లీ ఆ గిరినాగు వెనక్కు వస్తుందేమోననే భయంలో ఉన్నారు. వారు గిరినాగు సంచారంపై అటవీశాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే గిరినాగు పొలాల్లోకి వచ్చిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ పాము చూస్తుంటే భయంకరంగా ఉంది.. చూస్తేనే గుండె ఆగేలా ఉంది. ఈ భారీ పాముల్ని గిరినాగు, కింగ్ కోబ్రా అని పిలుస్తుంటారు.
ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఇటీవల గిరి నాగులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పామాయిల్ తోటల్లో ఎక్కువగా తిరుగుతుంటాయంటున్నారు. గతవారం మాడుగుల - సాగరం రోడ్డులోని తాచేరు వంతెనపై 12 అడుగుల గిరినాగు కలకలం రేపింది. ఆ రోడ్డులో వెళ్లే వాహనదారులు, స్థానికులు పామును చూసి భయంతో వణికిపోయారు. వెంటనే స్నేక్ క్యాచర్‌ను పిలిపించారు.. ఈలోపు గిరినాగు సమీపంలో ఉన్న పామాయిల్ తోటలోకి వెళ్లింది. వారు కూడా ఆ పాము వెళ్లిన దారిలో వెతుక్కుంటూ వెళ్లగా తోటలో ఓ చెట్టును చుట్టుకుని కనిపించింది. వీరు అక్కడికి వెళ్లడంతో అలికిడికి పడగ విప్పి బుసలు కొడుతూ మీదకు వచ్చింది.. వెంకటేష్ చాకచక్యంగా పామును పట్టుకుని పాడేరు మండలం వంట్లమామిడి దగ్గర అటవీ ప్రాంతంలో దీన్ని వదిలి పెట్టారు.
![]() |
![]() |