ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోకు ఆదాయపు పన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. 2021-22 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించి ఇండిగో ఎయిర్ లైన్స్ మాతృసంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ కు రూ. 944.20 కోట్ల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ జరిమానా విధించడం పట్ల ఇండిగో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 143(3) కింద కేంద్రం ఈ జరిమానా విధించింది. దీనిపై ఇండిగో అధికారులు మాట్లాడుతూ... "ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన ఉత్తర్వు చట్టవిరుద్ధమని మేము నమ్ముతున్నాము. దీనిని అన్ని చట్టపరమైన మార్గాల ద్వారా ఎదుర్కొంటాం" అని తెలిపారు. ఈ మేరకు ఇండిగో తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. ఈ జరిమానా విధింపుపై విమానయాన నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇండిగో యొక్క ఆర్థిక పనితీరుపై ప్రభావం చూపుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇండిగో మాత్రం తమ కార్యకలాపాలపై దీని ప్రభావం ఉండదని భరోసా ఇస్తోంది. కాగా, ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు జరిమానా విధించారన్న దానిపై స్పష్టత లేదు.
![]() |
![]() |